Dasari NarayanaRao: వ్యక్తిగతంగా తనకు దాసరి అంటే చాలా అభిమానం అని డైరెక్టర్ దావల సత్యం తెలిపారు. అలాగే తనంటే ఆయనకు కూడా చాలా ఇష్టం అని, కానీ తామిద్దరి మధ్యలో యూనియన్ అనే ఒక విష పురుగును పట్టుకొచ్చి పెట్టారని ఆయన తెలిపారు. రామాపురంలో సీత అనే సినిమా చిత్తూరులో షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కార్డ్స్ ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు లైన్లో నిలబడండి అని అన్నారని ఆయన చెప్పారు. తనకు షూటింగ్ అయ్యేటపుడు అలా మధ్యలో ఏమైనా వస్తే చాలా కోపం వస్తుందని ఆయన అన్నారు. తాను ఆ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానని, అంతే కాకుండా తాను ఆ 6 గంటలూ కూడా నిలబడే ఉంటానని ఆయన చెప్పారు. ఒకవేళ అలా నిలబడలేని సందర్భం ఉంటే అసలు షూటింగే పెట్టనని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రతి ఒక్కరూ అలెర్ట్ గా ఉండాలనేది తన ఉద్దేశం తప్ప… ఎవరినీ చిత్ర హింసలు పెట్టాలని కాదు అని ఆయన వివరించారు.
కానీ యూనియన్ వాళ్ళు వచ్చి ఆ షూటింగ్ మొత్తం డిస్టర్బ్ చేశారని సత్యం తెలిపారు. అలా చేసేసరికి తాను వెంటనే కోపం వచ్చి పోలీసులను పిలిచానని ఆయన చెప్పారు. కాగా అప్పుడు పోలీస్ వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసి తీసుకెళ్ళి లోపల వేశారని ఆయన అన్నారు. అప్పుడు దాసరి ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారని ఆయన తెలిపారు.
దాంతో దాసరి గారికి కోపం వచ్చి, అర్జెంట్ గా ఇప్పటికిప్పుడు వాళ్ళను బయటకు పంపించు అన్నారని సత్యం తెలిపారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా అన్నయ్య అంటే… దానికి ఆయన వాళ్ళు ఏమైనా చేయనివ్వు.. వాళ్ళు యూనియన్ లీడర్స్ నేను చెప్తున్నా కదా వాళ్ళను బయటకు పంపించు అన్నారని సత్యం చెప్పారు. తాను కాంప్రమైజ్ కాకపోయే సరికి నిన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ తర్వాత పెద్దలు మాట్లాడి ఆ విషయాన్ని సెటిల్ చేశారని సత్యం తెలిపారు. అలా వాళ్లిద్దరి మధ్య ఆ గొడవ సద్దమణిగే సరికి దాదాపు 3 సంవత్సరాలు పట్టిందని ఆయన వెల్లడించారు.