జబర్దస్తుగా అనసూయ కోసం ‘దర్జా’గా చూద్దామా?

చిత్రం : దర్జా

స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్

విడుదల తేది : 22 జూలై – 2022

రేటింగ్ : 2.75/5

నటీనటులు: సునీల్, అనసూయ, ఆమని, షఫీ, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్,ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు.

నిర్మాత: శివశంకర్ పైడిపాటి

నిర్మాణం: పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్

సమర్పణ: డాక్టర్ కామినేని శ్రీనివాస్

ఎగ్జిక్యూటివ్ అండ్ కో ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి

కెమెరా: దర్శన్

సంగీతం: రాప్ రాక్ షకీల్,

ఎడిటర్: ఎమ్ఆర్ వర్మ,

కథ: నజీర్

మాటలు: పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్

స్క్రిప్టు కో – ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,

ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ

పీఆర్వో: బీ వీరబాబు

సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 22, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఏదో ఒక అప్‌డేట్‌తో నిత్యం వార్తలలోనే ఉంది. రెండు మోషన్ పోస్టర్స్ విడుదల చేశారు. ఒకటి కె.ఎల్. నారాయణ విడుదల చేస్తే.. రెండోది యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. టీజర్ డి. సురేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ వెంకటేష్‌ విడుదల చేశారు. నాలుగు సాంగ్స్ ని అల్లు అరవింద్‌, కె. రాఘవేంద్రరావు, మైత్రీ మూవీస్ నవీన్ విడుదల చేశారు. దాదాపు ఇంటర్వ్యూలు పెట్టి ప్రమోషన్ చేసినంతగా పెద్ద పెద్ద వాళ్లు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్స్ అన్నింటిలో సినిమాకి సంబంధించిన ప్రోమోలు ప్లే అయ్యాయి. అలాగే అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో దాదాపు 15 రోజుల నుండి ప్రోమోలు ప్లే అవుతూనే ఉన్నాయి. 2 మంత్స్ ముందు నుండే ప్రొమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సినిమాకి రావాల్సినంత పబ్లిసిటీ బాగానే వచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో తెలుసుకుందాం..

కథలోకి వెళదాం… కనకం (అనసూయ భరద్వాజ్) సారా, అక్రమ వ్యాపారాలకు మాఫియా రాణి. బందరు ప్రాంతంలో తనకు నచ్చిన రీతిలో ఇలాంటివి నిర్వహిస్తూ ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. ఎవరైనా ఈ అమ్మడి అక్రమ వ్యాపారాలకు అడ్డు తగిలితే అతడి చాప్టర్ క్లోజ్. అతి సాధారణ ప్రజలే కాకుండా, కనకం అక్రమాలను, అన్యాయాలను ఎదురించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను సైతం తుదముట్టిస్తుంది. ఈ కనకం కు తోడుగా ఆమె సోదరుడు బళ్లారి (సమీర్) అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ తనకు ఎదురేలేదని అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఈ నేపథ్యంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కనకం, బళ్లారి ప్లాన్ చేస్తారు. కానీ అప్పటికే గణేష్ (అరుణ్ వర్మ) అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో రంగ హత్యకు గురవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ పోలీస్ ఆఫీసర్ శంకర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు. కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్‌ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? ఏ లక్ష్యంతో శంకర్ బందరు ప్రాంతానికి పోస్టింగ్ అవుతాడు? కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా? బళ్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు ముగింపు పలికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘దర్జా’ అసలు కథ.

విశ్లేషణ: ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం. ఒక పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన యువతి.. పెద్ద అయిన తర్వాత ప్రజలకు ఎలా ప్రాబ్లమ్‌గా మారింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం. ఇన్స్‌పెక్టర్ రవి వీరోచితమైన ఎంట్రీతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. దర్జా తొలి భాగం ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది. ఆ తర్వాత కనకం పాత్ర పరిచయం పవర్‌‌ఫుల్ ఎంట్రీ మరింత థ్రిల్ కు గురిచేస్తుంటుంది. ఇలా ఆర్టిస్టుల పరిచయాలతో పాటు ఆలస్యం లేకుండా కథలోకి తీసుకెళ్లడం దర్శకుడి ప్రతిభపై ఆసక్తి ఏర్పడుతుంది. కథ రెగ్యులర్‌, రొటీన్‌గానే ఉన్నప్పటికీ తెరమీద మేళవించిన విధానంతో సరికొత్తగా అనిపిస్తుంది. చాలా రకాల పాత్రల పరిచయం, కథలో వేరియేషన్స్ కారణంగా తొలి భాగం కాస్తా నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కమర్షియల్ ఫార్మాట్‌లో సునీల్ ఎంట్రీ వల్ల సెకండాఫ్‌పై దర్శకుడు సలీమ్ మాలిక్ అంచనాలు పెంచడంలో పూర్తిగా సఫలమయ్యాడనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధంలోకి తొంగి చూస్తే.. సునీల్, అనసూయ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. శంకర్, కనకం పాత్రలను దర్శకుడు మలిచిన విధానమే దర్జాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుంది. ఇలాంటి పాత్రలు తెరమీద ఇంతకు ముందు చూసినప్పటికీ సరికొత్త అనుభూతిని ఇస్తాయి. కథలో ప్రతీ చిన్న పాత్రకు కూడా బలంగా ప్రాధాన్యం ఉండడంతో సినిమా ఆసక్తిగా సాగింది. దర్శకుడు సలీమ్ మాలిక్ అనుకొన్న పాయింట్, కథను విస్తరించి రాసుకొన్న తీరుతోనే మంచి ప్రతిభ కనబరిచాడనిపిస్తుంది. సునీల్, అనసూయ తప్పితే మిగితా వారంతా కొత్తవాళ్లే.

కానీ వారి నుంచి టాలెంట్ రాబట్టుకొన్న తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి కారణమవుతుంది. కథలో చాలా పాత్రల్లో కొత్తవాళ్లే కనిపించినప్పటికీ.. ఆ రోల్స్‌కు కనెక్ట్ అయ్యేలా స్క్రిప్టు సిద్దం చేసుకోవడమే నైతికంగా చిత్ర యూనిట్ విజయం సాధించినంత లెక్క . అన్నా- తమ్ముడు, అక్కా-చెల్లెలు, అక్కా-తమ్ముడు లాంటి అపురూప బంధాలతో పెనవేసుకొన్న కథ ‘దర్జా’ చిత్రం. మీడియం రేంజ్ బడ్జెట్‌లో సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కథ రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అనుసరించిన కథనం ఆకట్టుకొనేలా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే… అనసూయలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’ సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్‌ విషయానికి వస్తే అనసూయగారే కనిపిస్తుంది. అనసూయ ని పెట్టి ఇంత వయలెన్స్ సినిమా తీశారేంటి? అని అనుకోవచ్చు. అయితే.. అంత యాక్షన్ ఉన్నా.. సెంటిమెంట్‌ని చక్కగా పండించింది అనసూయ.

కనకం పాత్రతో అనసూయ చెలరేగిపోయింది. డైలాగ్ డెలివరీలోను, అలాగే హావభావాలపరంగా అనసూయలో మరో కోణాన్ని చూడవచ్చు. రంగమ్మత్తగా ‘రంగస్థలం’లో, దాక్షాయనిగా ‘పుష్ప’లో తన నటనా సామర్ధ్యాన్ని రుచిచూపించిన ఆమె పూర్తి స్థాయి పవర్‌ఫుల్ పాత్ర లభిస్తే.. తాను ఎలా ఆడుకుంటానోననే విషయాన్ని నిరూపించింది.

దర్శకుడి విజన్‌కు తగినట్టుగా, పాత్రలోని బలాన్ని గుర్తించిన అనసూయ.. పెద్దగా శ్రమ లేకుండానే ఒదిగిపోయిందని చెప్పొచ్చు. ఇక శంకర్ లాంటి మంచి పాత్రలో సునీల్‌ తన మార్కును కళ్ళకు కట్టాడు. హీరో పాత్రలు కాకుండా క్యారెక్టర్లను నమ్ముకొన్న అతడు ‘పుష్ప’ తర్వాత లభించిన పవర్ ఫుల్ పాత్రని తనకు నచ్చిన శైలిలో సమర్ధవంతంగా పోషించాడు. ఇక ఇన్స్‌పెక్టర్ రవి, పుష్ప, రంగా, బళ్లారి, కానిస్టేబుల్‌గా షేకింగ్ శేషు, ఇన్స్‌పెక్టర్‌గా షఫీ, ఈ సినిమాలో వేటికి అవే ప్రాధాన్యం ఉన్న పాత్రలు అని చెప్పవచ్చు. ఆయా పాత్రల్లో వారు మంచి ప్రతిభనే కనబరిచారని చెప్పొచ్చు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసింది సినిమాటోగ్రాఫర్ దర్శన్ గురించి. ఫుల్ మార్కులు కొట్టేయడానికి ఆస్కారం ఉన్న నిపుణుడు ఆయన. ప్రతీ సన్నివేశాన్ని తన కెమెరాలో అందంగా బంధించాడు. ఆయన ఉపయోగించిన కెమెరా దర్జాకు ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది. ఎడిటర్ ఎమ్ఆర్ వర్మ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. రాప్ రాక్ షకీల్ సంగీతం ఫర్వాలేదు. ఇక స్పెషల్ సాంగ్‌ తెరమీద బాగా పండింది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా భేషుగ్గానే ఉంది. శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి, సమర్పకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనుసరించిన నిర్మాణ విలువలు సూపర్ . దర్జా కథను నమ్మి.. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకొన్న విధానంతో నిర్మాతల అభిరుచి ఏమిటో చెప్పకనే తెలుస్తుంది. ఖర్చుకు వెనుకాడకుండా పెట్టిన ప్రతీపైసా తెరమీద కనిపించేలా ఉంటుంది. క్వాలిటీ, అవుట్‌పుట్ చూసిన తర్వాత.. బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనుకాడలేదట. అందులోనూ ఇది వారి మొదటి చిత్రం. నిర్మాణం పరంగా మంచి క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదట. మొత్తం మీద యాక్షన్‌తో నిండిన సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. కామెడీ, డ్యాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సరేలే.. ఓసారి అనసూయ కోసమైనా చూద్దాం..

-ఎం.డి. అబ్దుల్