రాధేశ్యామ్‌లో చిన్న సెట్ కోసం అంత ఖ‌ర్చు పెట్టారా..!

రానున్న రోజుల‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచే చిత్రాలు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. ఇందులో ప్ర‌భాస్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన రాధే శ్యామ్ కూడా ఉంది. ఈ సినిమాను 1970 కాలం నాటి పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇదొక స్వ‌చ్చ‌మైన ప్రేమ కావ్యంగా ఉంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇట‌లీలోనే చిత్రీక‌రించారు. 140 కోట్లకు పైగా బ‌డ్జెట్‌ను ఈ సినిమా కోసం కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోస‌మే ఏకంగా 6 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌.

జూలై 30న విడుద‌ల కానున్న రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఓ గ్లింప్స్ వీడియో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు చాలా థ్రిల్ క‌లిగించాయి. ప్ర‌తి స‌న్నివేశం చాలా రిచ్‌గా క‌నిపిస్తుండగా, వీటి కోసం ఎంత ఖ‌ర్చు పెట్టార‌నే చ‌ర్చ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంది. అయితే గ్లింప్స్ లో మొదట ఓ లాంగ్ షాట్ లో ఒక రెట్రో ట్రైన్ ను చూపించగా, తర్వాత క్లోజప్ షాట్ లో కూడా ఇదే ట్రైన్ ను చూపిస్తారు. అయితే.. ఆ ఒక్క ట్రైన్ సెట్ కోసమే ఏకంగా 1.6 కోట్లు ఖర్చు చేశారట మేకర్స్!

అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన ప్ర‌త్యేక సెట్ కోసం అంత ఖ‌ర్చు చేశారా అని ఈ విష‌యం తెలిసిన ప్రతి ఒక్క‌రు నోరెళ్ల పెడుతున్నారు. క‌ళ్ళ‌కు ఇంపుగా ఉండేలా ప్ర‌తి స‌న్నివేశాన్ని చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుండ‌గా, వెండితెర‌పై ఈ సినిమా చూస్తే ప్రేక్ష‌కులు ఆనందంలో త‌డిసి ముద్ద‌వ్వ‌డం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. సౌత్ కోసం ఒక్కరు నార్త్ కోసం ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు రాధే శ్యామ్ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు.