తెలంగాణలో తగ్గుతోంది.. ఏపీలో ‘కోవిడ్’ ఎందుకు తగ్గట్లేదు.?

Covid Status In Telangana And Andhra Pradesh

Covid Status In Telangana And Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం.. కాస్త చిత్రంగా కనిపిస్తోంది. తెలంగాణలో పరిస్థితి అదుపులోనే వుంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనే కరోనా వైరస్ అదుపు తప్పిందనే భావన కలుగుతోంది. అధికారికంగా రెండు తెలుగు రాష్ట్రాలూ విడివిడిగా విడుదల చేస్తున్న కరోనా బులెటిన్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల లోపే వుంటోంది. దాదాపు 90 వేల టెస్టులు జరుగుతున్నాయి ప్రతిరోజూ. అదే ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, ఇక్కడా 90 వేల టెస్టులే జరుగుతున్నాయి.. కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 20 వేలకు అటూ ఇటూగా వుంటోంది. తెలంగాణలో అత్యధికంగా ఓసారి 10 వేలు దాటి, పన్నెండు వేలకు చేరుకుంది రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. కొద్ది రోజుల క్రితం మాట ఇది. అప్పట్లో లక్షా పాతిక వేలకు పైన టెస్టులు చేసింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, గరిష్టంగా రోజువారీ కేసులు 24 వేల మార్కుని టచ్ చేసింది. కొన్నాళ్ళ క్రితం లక్షకు పైగా టెస్టులు చేసిన ఆంధ్రపదేశ్ అనూహ్యంగా టెస్టుల సంఖ్య తగ్గించేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలవుతోంది.

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ స్థానంలో కర్ఫ్యూ అనే పేరు పెట్టారు. ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, మొత్తం ఆరు గంటల పాటు వెసులుబాటు కల్పించారు కర్ఫ్యూ నుంచి. తెలంగాణలో లాక్ డౌన్ నుంచి వెసులుబాటు కేవలం నాలుగు గంటలు మాత్రమే. రెండు రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. కర్ప్యూ లేని సమయంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోకి వాహనాల్ని పొరుగు రాష్ట్రాల నుంచి అనుమతిస్తున్నారు. తెలంగాణలోకి రావాలంటే, లాక్ డౌన్ లేని సమయంలో (ఆ నలుగు గంటలు) కూడా ఇ-పాస్ తప్పనిసరి. లోపం ఎక్కడ జరుగుతోంది.? ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎందుకు ఎక్కువగా వుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లైతైన అధ్యయనం చేయాల్సి వుంది. తెలంగాణతో పోల్చితే, గ్రామ స్థాయిలోకి కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయినట్లుగా ఆంధ్రపదేశ్ గురించిన వార్తలు వినవస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే, అది అపారమైన నష్టాన్ని కలగజేస్తుందన్నది నిర్వివాదాంశం.