ఈ సంక్షోభం నుంచి నరేంద్ర మోడీ గట్టెక్కేదెలా.?

Covid 19: Utter Failure Of Modi Government

కరోనా సంక్షోభం ప్రధాని నరేంద్ర మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సెకెండ్ వేవ్ విషయమై కేంద్రం ప్రదర్శించిన నిర్లక్షం.. ఇప్పుడు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. నిజానికి, మొదటి వేవ్ కూడా ఇదే స్థాయిలో దేశాన్ని సంక్షోభంలో పడేసినా.. కరోనా వైరస్ అప్పటికి ప్రపంచానికి కొత్త కావడంతో, మోడీ సర్కారుని నిందించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. కానీ, రెండో వేవ్ పరిస్థితి వేరు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వినిపిస్తోంది. అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టడం.. అన్నిటికీ మించి, ప్రజల్ని సెకెండ్ వేవ్ విషయమై ముందే అప్రమత్తం చేయడం.. ఇలాంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాం. కథ ఇక్కడితో అయిపోలేదు.. ముందుంది ముసళ్ళ పండగ.. అంటున్నారు నిపుణులు. అదే మూడో వేవ్.

ఆగస్టులోనే మూడో వేవ్ వుండొచ్చన్నది నిపుణుల అంచనా. అదే నిజమైతే, ఆగస్టు ఎంతో దూరంలో లేదు గనుక, మరింత భారీ నష్టం దేశానికి ఎదురుకావొచ్చు. సెకెండ్ వేవ్ తాలూకు గ్రాఫ్ ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తోందన్న అంచనాల నడుమ, మూడో వేవ్ భయాలు దేశాన్ని వణికించేస్తున్నాయి. ఇదంతా ముమ్మాటికీ నరేంద్ర మోడీ వైఫల్యమే.. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలంతా ఒప్పుకుంటున్న పరిస్థితి. ఈ విషయమై బీజేపీలోనూ కొంత అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారం మీద పెట్టిన ఫోకస్, ప్రజల బాగోగులపై మోడీ పెట్టడంలేదన్న అసహనం బీజేపీలోనూ కొందరిలో వ్యక్తమవుతోందట. దాంతో, బీజేపీలో అంతర్గతంగా కల్లోలం మొదలైనట్లేనని అంటున్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సైతం చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ప్రపంచానికి టీకాలు అందిస్తున్నది మనమే.. అని గొప్పగా చెప్పుకున్న మోడీ, భారతదేశంలో టీకా లభ్యత లేకపోవడంపై పెదవి విప్పలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? ఈ సంక్షోభం నుంచి మోడీ సర్కార్ ఎలా దేశ ప్రజల్ని రక్షిస్తుందో.. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఎన్నాళ్ళు మోడీ సర్కార్ మనుగడ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.