కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు.. లక్ష లోపు కేసులు రోజువారీగా నమోదవుతుండడాన్ని కొంత ఊరటగా భావిస్తున్నామంతే. ఇంతలోనే మూడో వేవ్ గురించిన భయాలు బయల్దేరాయి. ఇంకోపక్క దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇంతకీ, మూడో వేవ్ వస్తే పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ప్రభుత్వాలు మాత్రం, మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా వున్నామంటున్నాయి.
చిన్నారులకు మూడో వేవ్ నేపథ్యంలో సమస్య ఎక్కువగా వుంటుందన్న ముందస్తు అంచనాల నేపథ్యంలో, చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెబుతోంది. చిన్న పిల్లల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలూ ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇదే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే, 5 ఏళ్ళ లోపు చిన్న పిల్లలు మాస్క్ ధరించడం మంచిది కాదని కేంద్రం చెబుతోంది.
వారికి రెమిడిసివిర్ వాడకూడదట. పెద్దవాళ్ళలోనే రెమిడిసివిర్ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా, దాని వల్ల నష్టం ఎక్కువ జరిగిందన్న విమర్శలున్నాయి. చిన్న పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం పెద్దగా వుండదని మొదట్లో అంచనా వేసినా, ఆ అంచనా తప్పని తేలింది. మరి, ఎలా పిల్లల్ని కాపాడేది.? ప్రభుత్వాల సన్నద్ధత మరణాల సంఖ్య తగ్గించగలదేమోగానీ, ఆపలేదు. ఆపడానికి మన ముందు ఇంకే మార్గమూ కనిపించడంలేదు.
వ్యాక్సినేషన్ రెండు మూడు నెలల్లో మొత్తంగా పూర్తయ్యే పరిస్థితి కూడా లేదు. చిన్న పిల్లలకు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశమూ లేదు. ప్రస్తుతానికైతే మూడో వేవ్ విషయమై ఆ దేవుడే దిక్కు. మొదటి వేవ్ వచ్చాక, సెకెండ్ వేవ్ విషయమై ముందే అప్రమత్తం కాకపోవడం వల్లే ఇప్పుడు మూడో వేవ్ వస్తే.. దేవుడే దిక్కు.. అనే దుస్థితికి మనం రావాల్సి వచ్చింది.