కరోనా ఎఫెక్ట్ – స్కూళ్ళ బంద్: ఈ పాపం ఎవరిది.?

Covid 19 - schools Bandh

Covid 19 - schools Bandhదేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా వుండొచ్చని వైద్య నిపుణులు, తొలి వేవ్ నడుస్తున్నప్పుడే అంచనా వేశారు. కానీ, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయాయి. కరోనా ఉధృతంగా విస్తరిస్తున్న సమయంలోనే మద్యం దుకాణాల్ని తెరిచారు. అక్కడితోనే అసలు కథ మొదలయ్యింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టేసరికి.. దాదాపుగా అంతా ‘నార్మల్’ అనే భావనకు వచ్చేశారంతా.

ప్రధానంగా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. ప్రభుత్వాలూ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించాయి. జనం సంగతి సరే సరి. పార్టీలు, పబ్బులు.. ఇలా అన్నీ జరిగాయ్. ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ షురూ అయ్యింది. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే విద్యా సంస్థలకు సంబంధించి మొదటి నుంచీ చాలా అభ్యంతరాలు వచ్చాయి. కానీ, విద్యా సంస్థలు తెరచుకున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ఒత్తిడి కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. కారణం ఏదైతేనేం, స్కూళ్ళను, కాలేజీల్నీ తెరిచేశారు. అయినా, ఎంతకాలం మూసి వుంచగలం.? అన్న ప్రశ్న వుండడం సబబే. కానీ, ఈ పరిస్థితి చాలా ప్రత్యేకం గనుక, కాస్త ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచించి వుండాల్సింది.

తెలంగాణలో చిన్న పిల్లలకు స్కూళ్ళు తెరవలేదు. ఆంధ్రపదేశ్‌లో మాత్రం చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్ళు కూడా తెరిచేశారు. ఫలితం, అనూహ్యంగా కరోనా వైరస్.. విద్యార్థుల్ని టార్గెట్ చేయడం. కొద్ది రోజుల్లోనే సీన్ మారిపోయింది. తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘మా జీవితాలతో ఆడుకోవద్దు..’ అంటూ ఏపీలోనూ జనం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోపక్క, దేశంలో ఎన్నికల కోలాహలం కూడా కరోనా వ్యాప్తికి కారణమన్న వాదనలు లేకపోలేదు. కారణాలు వెతుక్కునే సమయం కాదిది. కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిందే.