రంగంలోకి దిగిన కేసీఆర్: అయినా విమర్శలు తప్పట్లేదాయె.!

Covid 19: KCR Visits Gandhi Hospital

Covid 19: KCR Visits Gandhi Hospital

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణకే తలమానికం అయిన గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వైద్య చికిత్స పొందుతోన్న కరోనా బాధితుల్ని పరామర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై వాకబు చేశారు. గాంధీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ కేసీఆర్, కోలుకున్న విషయం విదితమే. ప్రస్తుతం హెల్త్ మినిస్ట్రీ కేసీఆర్ వద్దనే వుంది. దాంతో, వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల్ని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్, గాంధీ ఆసుపత్రిని సందర్శించినట్లు తెలుస్తోంది. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ, పీపీఈ కిట్స్ ధరించకుండా కరోనా బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శించడంపై విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి.

కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, పలువురు అధికారులు వున్నారు. ఎవరూ పీపీఈ కిట్లు ధరించలేదు. మరోపక్క, కరోనా వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి వినిపిస్తున్నా పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటీవల కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆ వెంటనే ఆయన గాంధీ ఆసుపత్రిని సందర్శించడం పట్ల పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. నిజానికి, కేసీఆర్.. ఇప్పటికైనా గాంధీ ఆసుపత్రిని సందర్శించినందుకు ఆయన్ని అభినందించాలి. కరోనా వైద్య చికిత్స అందిస్తోన్న అతి పెద్ద ఆసుపత్రి తెలంగాణలో ఏదన్నా వుందంటే అది గాంధీ ఆసుపత్రి మాత్రమే. ఇక్కడ పెద్దయెత్తున కరోనా బాధితులకు వైద్య చికిత్స అందుతోంది. అదే సమయంలో, గాంధీ ఆసుపత్రిలో సమస్యలపై ఎప్పటికప్పుడు సిబ్బంది ఆందోళనలు చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో కేసీఆర్, గాంధీ ఆసుపత్రి సమస్యల్ని పరిష్కరిస్తారా.? లేదా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.