ఖతం కాంగ్రెస్: ఇది హస్తం పార్టీ స్వయంకృతాపరాధం.!

Congress Party, A Self Distruction Party!

Congress Party, A Self Distruction Party!

ఎలా వుండే పార్టీ, ఎలా అయిపోయిందీ.! దేశవ్యాప్తంగా చాలామంది కాంగ్రెస్ అభిమానులు వ్యక్తం చేస్తోన్న ఆవేదన ఇది. కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులే అవసరం లేదు.. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమే ఆ పార్టీని సర్వనాశనం చేసేస్తుందని చాలా ఏళ్ళ క్రితమే ఆ పార్టీకి చెందిన చాలామంది ముఖ్య నేతలు పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు.. పార్టీలోని పరిస్థితులపై. వాళ్ళు ఊహించిందే నిజమయ్యింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని క్రమంగా కోల్పోతోంది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలు కన్పించడంలేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అనేది వుంటేనే కదా.! సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు.. దానికి తోడు వృద్ధాప్య సమస్యలు కూడా వున్నాయ్. పోనీ, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడపగలరా.? అంటే, అదీ లేదు. కేవలం టైమ్ పాస్ పొలిటీషియన్ అయిపోయారు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ కూడా, రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే సత్తా తనకు లేదన్నట్టే వ్యవహరిస్తున్నారు.

సీనియర్ నేతలు ఒకరొకరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్’ పేరుని బీజేపీ పూర్తిగా తమ వశం చేసేసుకుంది. పీవీ నరసింహారావు పేరు గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పటేల్ విషయంలో కావొచ్చు, పీవీ విషయంలో కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందన్నది నిర్వివాదాంశం. ‘పీవీని అవమానించిన పార్టీ’ అనే ముద్ర కాంగ్రెస్ పార్టీ మీద పడిపోయింది. ప్రణబ్ ముఖర్జీని తీసుకున్నా అంతే. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒకప్పుడు ట్రబుల్ షూటర్. అలాంటి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వదిలించేసుకుంది. దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. నిజానికి కాంగ్రెస్ నాయకులే ఎక్కువగా కనిపిస్తారు. కానీ, ఆ మహనీయుల పేర్లను వేరే పార్టీలు క్రమంగా సొంతం చేసేసుకుంటున్నాయి. తమ ఆస్తిని వేరే పార్టీలు కొల్లగొట్టేస్తున్నా చూసీ.. ఏమీ చేయలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇదంతా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో.. వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీ పేరు చెప్పుకుని రాజకీయంగా మనుగడ సాధించేందుకు యత్నిస్తున్నారు. అలాంటివాళ్ళని నమ్ముకోవడమే కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద శాపంగా మారుతోంది.