కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గురించి తెలుసు కదా. మొండి మనిషి. ఎవ్వరి మాటా వినడు. దూకుడు ఎక్కువ. ఎవ్వరినైనా తన మాటలతో మటాష్ చేయగలరు. తెలంగాణ ఫైర్ బ్రాండ్. డేర్ అండ్ డాషింగ్. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు ఎదురుగా నిలబడగలిగే దమ్మున్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు.
తెలంగాణలో జరుగుతున్న ఎన్నో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి గెలిచారు. రేవంత్ రెడ్డి మీద కూడా ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నా.. అవన్నీ నిరాధారాలుగానే మిగులుతున్నాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… కొన్ని రోజుల కింద శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది కదా. దానిపై రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఆ ప్రమాదంపై ఆయన ప్రధానికి ఫిర్యాదు చేశారు. సీబీఐతో పాటుగా సీఈఏతో విచారణ చేయించాలని ప్రధానిని కోరారు. సీఈఏ అంటే.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. ఈ ఘటనలో క్రిమినల్ కోణం ఉందని… అగ్ని ప్రమాదం వల్ల వందల కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ అగ్ని ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారో తెలియాలంటే ఖచ్చితంగా సీబీఐ విచారణ జరపాల్సిందే. ఈ ప్రమాదం వల్ల కొందరికి లాభం జరుగుతుంది. ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి, పదవీ విరమణ చేసిన వ్యక్తి అయిన ప్రభాకర్ రావును ఇంకా.. ఎండీగా ఉంచడం వల్ల తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో రెండు సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రభాకర్ రావు హయాంలో జరిగిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లు అన్నింటిపై విచారణ జరిపించాలని ప్రధానిని కోరుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
ఇక.. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందారు. కొంతమందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది.
ఇక.. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వాళ్లలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు.