Rashmika: సినీ నటి రష్మిక మందన్న గత కొంతకాలంగా తరచు వివాదాలలో నిలుస్తున్నారు. అయితే తాజాగా రష్మిక వ్యవహార శైలి పై కర్ణాటక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ రష్మికకు సరైన విధంగా గుణపాఠం చెప్పాలి అంటూ విమర్శలు కురిపించారు.
బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. తాను నేడు ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు కారణం కన్నడ చిత్ర పరిశ్రమని తెలిపారు. తనకు జీవితాన్ని ఇచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమను ఆమె గుర్తించుకోవాలని తెలిపారు. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా రష్మిక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
కిరీక్ పార్టీ అనే సినిమా ద్వారా రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నారు అనంతరం తెలుగులో అవకాశాలు అందుకుంటూ ఈమె పూర్తిగా తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రష్మిక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయిన తర్వాత పలు సందర్భాలలో కన్నడ భాష గురించి తప్పుగా మాట్లాడారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. అంతేకాకుండా, మా ఇల్లు హైదరాబాద్‌లో ఉందని కర్ణాటక ఎక్కడో కూడా తనకు తెలియదు అన్నట్టుగా ఆమె వ్యవహరించిన తీరుపై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
ఇటీవల కాలంలో రష్మిక కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా? అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇలా ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మరోసారి రష్మిక వివాదంలో నిలిచారని చెప్పాలి.
