తెలంగాణలోని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలుసు కదా. తనో ఫైర్ బ్రాండ్. సీఎం కేసీఆర్ ను అయినా.. టీఆర్ఎస్ పార్టీ నేతలనైనా.. ఎవ్వరినైనా తప్పు చేసిన వాళ్లకు మొహం ముందే కడిగేస్తారు ఆమె. ములుగు జిల్లాలో సీతక్క అంటే ఒక ఫైర్ బ్రాండ్. అక్కడి గిరజనుల పాలిట దేవత సీతక్క. లాక్ డౌన్ సమయంలో ములుగు ప్రాంతంలోని గిరిజనులకు, పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించారు ఆమె. ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ఆమె ముందుంటారు. తనకు తోచిన సాయం చేస్తుంటారు. అందుకే ఆమెకు ములుగు జిల్లాలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్.
అయితే.. ఎమ్మెల్యే సీతక్క ములుగు ప్రాంతంలో చేసే సామాజిక సేవ గురించి ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలిసింది. దీంతో రాహుల్ గాంధీ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. సీతక్క లాంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉండటం గర్వకారణమంటూ ఆయన పొగిడారు.
శనివారం సోషల్ మీడియా విభాగంతో రాహుల్ గాంధీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎమ్మెల్యే సీతక్క ప్రస్తావనను తీసుకొచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్క చాలా కష్టపడుతున్నారని.. ప్రజల బాధలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ఆమె తూచా తప్పకుండా పాటిస్తున్నారంటూ రాహుల్ గాంధీ అభినందించారు. దేశంలోనే సీతక్క హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటూ రాహుల్ కితాబిచ్చారు.
ములుగు జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. లాక్ డౌన్ సమయంలో గిరిజనులకు తినడానికి తిండి కూడా దొరకలేదు. సరుకులు దొరక్క.. పని లేక గిరిజనులు నానా అవస్థలు పడ్డారు. వాళ్ల అవస్థలు తెలుసుకున్న సీతక్క.. కిలోమీటర్ల మేర నడిచి వాళ్లకు నిత్యావసర సరుకులు, కురగాయలను ఉచితంగా అందించారు. లాక్ డౌన్ సమయంలో అన్ని రోజులు కొండలు, గుట్టలు దాటుతూ సీతక్క ప్రతి రోజు గిరిజనులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించారు.
గో హంగర్ గో చాలెంజ్
అయితే సీతక్క సోషల్ మీడియాలో గో హంగర్ గో అనే చాలెంజ్ ను ప్రారంభించారు. ఈ చాలెంజ్ ద్వారా పేదలకు కొన్ని రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆమె పేదలకు సేవ చేస్తూనే ఉన్నారు.