తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఎంతటి పోటీ నెలకొని ఉందో అందరికీ తెలుసు. ఒకవైపున వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి పదవికి పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి తనకు పదవి కావాలని చెప్పకపోయినా ఇవ్వాల్సిందే అన్నట్టు పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి మాత్రం పదవి కావాలని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. దీంతో ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించలేక చిక్కుల్లో పడింది అధిష్టానం. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అన్నట్టు మౌనంగా చూస్తూ కూర్చుంది. ఈలోపు దుబ్బాక ఉప ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో పార్టీని గెలిపించినవారికి పదవి ఖాయమని కండిషన్ పెట్టారు. దీంతో నాయకులు ఎవరికివారు గట్టిగా పనిచేశారు. దీంతో మళ్ళీ సంశయం మొదటికే వచ్చింది.
ఇక త్వరలో గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుండే సన్నాహకాలు మొదలుపెట్టిన హస్తం పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరిని కూర్చోబెడితే ఎన్నికల్లో మైలేజ్ వస్తుందో అనే సందిగ్ధంలో పడింది. గ్రేటర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అధికార పార్టీ బాధ్యత మొత్తం కేటీఆర్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా పార్టీని లీడ్ చేసే నాయకులు ఆయనకు సరిసమానంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో అలాంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి ఒక్కరే. రేవంత్ మొదటి నుండి కేసీర్ మీద ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నారో కేటీఆర్ మీద కూడ అలాగే యుద్ధం చేస్తున్నారు. వారిద్దరూ ఎదురెదుగా ఉంటేనే పోటీ రసవత్తరంగా ఉంటుంది.
పైపెచ్చు ఆయన మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. నరగంలో ఆయనకున్న ఫాలోయింగ్ మిగతా లీడర్లతో పోల్చుకుంటే ఎక్కువే. అలాంటి వ్యక్తికి పదవి అందిస్తే అన్ని విధాలా బాగుంటుందని అధిష్టాన వర్గం ఆలోచిస్తోందట. అలాగే రేవంత్ బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు కూడ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కొద్దిగా కంగారుపెడుతున్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డికి పదవి అప్పగిస్తే పార్టీలోని సీనియర్లు తప్పకుండా నొచ్చుకుంటారు. అందుకే ముందుగా వాళ్ళను శాంతింపజేసి వారంతా ఓకే అన్నాక రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట.