తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వరుసగా రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై దృష్టి సారించాయి.
ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. దీంతో పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించాయి. బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించింది. అధికారికంగా ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత. తాజాగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరో కాదు.. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు.