లోకేష్ తీరు పై ఎథిక్స్ క‌మిటీకి ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లిలో అక్క‌డ ప‌రిస్థితుల‌ను టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఫోటోలు, వీడియోలు తీయ‌డం వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వైకాపా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. లోకేష్ ఏ ఉద్దేశంతో వీడియోల తీసార‌ని? ఇది స‌భ ఉల్లంఘ‌న కిందకొస్తుంద‌ని మండిప‌డ్డారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై వైకాపా లోకేష్ పై ఎథిక్స్ క‌మిటీకి ఫిర్యాదు చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. శాస‌న మండ‌లిలో బిల్లును ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డుకునేందుకు నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఫోటోలు తీసార‌ని, గ‌తంలో కూడా ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించి శాస‌న స‌భ‌లో ఆమోదం పొందిన బిల్లులు చ‌ర్చ‌కు రాకుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా, కుట్ర‌పూరితంగా వ్య‌వరించార‌ని వైకాపా ఫిర్యాదులో పేర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా రెండు, మూడు రోజ‌ల్లో ఎథిక్స్ క‌మిటీని కలిసి ఫిర్యాదు చ‌య‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల నుంచి తెలిసింది. అలాగే మండ‌లిలో వైకాపా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుపై జ‌రిగిన దాడికి సంబంధించి అసెంబ్లీ కార్య‌దర్శి బాల‌కృష్ణ‌మా చార్యుల‌ను క‌లిసి ఫిర్యాదు చేసారు. తేదాపా నేత‌లు అధికార ప‌క్షంపై మాట‌ల దాడే కాకుండా భౌతిక దాడికి సిద్ద ప‌డుతున్నార‌ని వెల్లంప‌ల్లి ఆరోపించారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కోపాన్ని, వాళ్ల నేత‌లు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు అన్న కోపం, అక్క‌సాన్ని ఇప్పుడు మండ‌లిలో చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీనంత‌టికీ అస‌లు కారణం చంద్ర‌బాబు నాయుడు అని ఆయ‌న ఇవ‌న్నీ వెనుకుండి చేయిస్తున్నార‌ని ఆరోపించారు.

మండ‌లి అన్నా..పెద్దల స‌భ అన్నా చంద్ర‌బాబు ఏ మాత్రం గౌర‌వ, మ‌ర్యాద‌లు లేకుండా వహ‌రిస్తున్నార‌ని ఆక్షేపించారు. పుత్ర‌ర‌త్నం లోకేష్ ఇలాగే వ్య‌వ‌రిస్తున్నార‌ని మండ‌లిలో రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల్ని టీడీపీ ఖండించే ప్ర‌య‌త్నం చేసింది. మండ‌లిలో ఎవ‌రు దాడులు చేసారో? ఎవ‌రు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ్డారో? సీసీ టీవీ పుటేజ్ బయ‌ట పెడితే తెలుస్తుంద‌ని టీడీపీకి చెందిన మండ‌లి స‌భ్యులు వాదిస్తున్నారు. ఈ మేర‌కు మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ కు ఫిర్యాదు కూడా చేసారు.