వ‌ణికిస్తున్న విక్ర‌మ్.. కోబ్రా లుక్‌తో కేక పెట్టిస్తున్న త‌మిళ హీరో

చియాన్ విక్ర‌మ్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు నుండి మొద‌లు పెడితే తమిళం, మ‌ల‌యాళం, హిందీ ప్రేక్ష‌కులకు విక్ర‌మ్ చాలా సుప‌రిచితం. తాను చేసే ప్ర‌తి సినిమాని ఎంతో వైవిధ్యంతో చేస్తూ వ‌స్తున్నాడు. క్యారెక్ట‌ర్‌కు అనుగుణంగా త‌న బాడీని మార్చుకొని ప్రేక్ష‌కుల మెప్పు పొందుతున్నాడు. గ‌త కొంత కాలంగా మంచి స‌క్సెస్ సాధించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్న విక్ర‌మ్.. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. గ‌త కొంత కాలంగా ఈ సినిమాకి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ రోజు మ‌రో స్ట‌న్నింగ్ లుక్ రిలీజ్ చేశారు.

కోబ్రాలో విక్రమ్ సెకండ్ లుక్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుదల చేసింది. ఆ ఫొటోలో పొడవాటి.. గజిబిజిగా ఉన్న‌ జట్టుతో కనిపించాడు విక్రమ్. అంతేకాక ఆయ‌న మెద‌డులోఅంకెలు, ఫార్ములాలు ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాక సినిమాపై అంచ‌నాలు పెంచింది. చిత్రంలో 20కి పైగా పాత్ర‌ల‌లో విక్ర‌మ్ క‌నిపించ‌నున్నట్టు ప్రచారం జ‌రుగుతుండ‌గా, ఈ సినిమాతో చియాన్ హ‌ద్దులు చెరిపేస్తాడ‌నే టాక్ న‌డుస్తుంది.

క‌రోనా కాని రాక‌పోయి ఉంటే కోబ్రా చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చేసేది. క‌రోనాకి ముందు ర‌ష్యాలో కీల‌క షెడ్యూల్ జ‌రిపిన మేక‌ర్స్ ఇప్పుడు త‌మిళ‌నాడులో ప్ర‌త్యేక సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో భార‌త మాజీ క్రికెట‌ర్ ఇర్ఫ‌న్ ప‌ఠాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సినిమాలో ఆయ‌న లుక్‌కి సంబంధించిన ప‌లు ఫోటొలు ఇప్ప‌టికే విడుదల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.