తెలంగాణ సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం.. రిజిస్ట్రేషన్లపై సరికొత్త స్టెప్ వేయడం అందరికీ తెలిసిందే. ప్రతి మున్సిపాలిటీలోనూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా… తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్స్, ఇంకా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అయితే.. ఇప్పటికే ఆన్ లైన్ లో నమోదు అయి ఉన్నవాటిని కాకుండా.. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో నమోదు కాని… ఇళ్లు ఉన్నా.. ఇళ్ల స్థలాలు ఉన్నా.. అపార్ట్ మెంట్లు ఉన్నా.. వ్యవసాయేతర ఆస్తులు ఉన్నా.. వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపే ఆస్తుల వివరాలన్నీ ఆన్ లైన్ చేయాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా ధరణి పోర్టల్ ను యుద్ధప్రాతిపదికన తీసుకురానున్నారు.
ధరణి పోర్టల్ లో ప్రతి భూమికి సంబంధించిన వివరాలు ఉంటాయి. వాటిని ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు. అందుకే ప్రతి వివరాలను ఆన్ లైన్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని పారదర్శకంగా ఉంచడం కోసమే ధరణి పోర్టల్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతం చేయాలన్నారు.
ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి
ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు పూర్తి వివరాలను ప్రజలు కూడా అధికారులకు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రజలు నిస్సంకోచంగా తమ ఆస్తుల వివరాలన్నింటినీ అధికారులకు సమర్పించాలని.. దాని వల్ల ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు ఎంతో పారదర్శకంగా ఉంటాయని.. అది భవిష్యత్తులో ప్రజలకే ఎంతో మేలు చేకూర్చుతుందని సీఎం తెలిపారు.