సీఎం కేసీఆర్.. దూకుడు పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సదీర్ఘంగా ప్రసంగించారు. ఈసందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటదో తెలుసు కదా. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రచార సభలో విపక్షాలపై కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ లో వరదలు వస్తే.. ఒక్కరు రాలేదు. ప్రధానిని అడిగితే రూపాయి ఇవ్వలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం వరదలా వస్తున్నరు హైదరాబాద్ కు. కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక.. ఇన్ని రాష్ట్రాల నుంచి కేవలం మున్సిపల్ ఎన్నికలకు ఎందుకొస్తున్నరు. మున్సిపల్ ఎన్నికలా ఇవి లేక నేషనల్ ఎన్నికలా? అంటూ కేసీఆర్ బీజేపీ నేతలకు చురకలంటించారు.
కేసీఆర్ మీ బిడ్డ.. ఎప్పటికీ తెలంగాణ బిడ్డ.. తెలంగాణలోనే ఉంటడు. బక్క కేసీఆర్ ను కొట్టేందుకు గింతమంది తెలంగాణకు రావాల్నా? వరద సాయం వాళ్లు ఇవ్వలేదు. ఆదుకునే వాళ్లను ఆదుకోనీయలేదు. అందుకే.. వరద బాధితులు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు రాగానే.. డిసెంబర్ 7 నుంచే వరద బాధితులకు సాయం అందిస్తాం. ఇప్పటికే 6.5 లక్షల మందికి ప్రతి ఒక్కరికి 10 వేల సాయం అందించాం. ఇంకా రెండు మూడు లక్షల మంది ఉన్నా కూడా వాళ్లకు మరో మూడునాలుగు వందల కోట్లు అయినా వెనకాడకుండా వరద బాధితులకు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
కేంద్రం సాయం చేయకున్నా… ఏ రాష్ట్రాల్లో వరదలు వచ్చినా.. ఏ రాష్ట్రం వరద సాయం అందించకున్నా కూడా పేదల బాధలు చూసి తానే స్వయంగా కుటుంబానికి 10 వేలు ఇవ్వాలని నిర్ణయించానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతకుముందు… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి సీఎం కేసీఆర్ వివరించారు.