కేంద్రం ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై కొన్ని చోట్ల ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే కదా. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా వ్యవసాయ బిల్లుకు నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ బిల్లుపైనే చర్చ నడుస్తోంది.
కొత్త వ్యవసాయ బిల్లు వల్ల వ్యవసాయానికి సంబంధించి ఎన్నో సంస్కరణలు చోటు చేసుకుంటాయని.. అవి దేశ వ్యాప్తంగా వ్యవసాయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ముందడుగు అని కేంద్రం చెబుతున్నా.. ఆ బిల్లుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర వ్యవసాయ బిల్లుపై ఫైర్ అయ్యారు. దాన్ని తేనె పూసిన కత్తితో పోల్చారు. ఆ బిల్లు వల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు. రైతులను దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లు కేవలం కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉందన్నారు.
ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలంటూ… ఎంపీ కేశవరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని.. రాజ్యసభలో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో టీఆర్ఎస్ తరుపున గట్టిగా వ్యతిరేకించాలంటూ కేశవరావుకు సీఎం కేసీఆర్ తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంపీలను సీఎం ఆదేశించారు.
ఇంకా సీఎం కేసీఆర్ ఏమన్నారంటే.. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ.. నిజానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకులను కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు ఓపెన్ చేయడానికి ఉపయోగపడే బిల్లు. రైతులు తమ సరుకులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు కానీ… రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును రవాణా ఖర్చులను భరించి వాహనాల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం అసలు సాధ్యమవుతుందా? ఇది ఖచ్చితంగా తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని వ్యతిరేకించి తీరాలి… అని సీఎం స్పష్టం చేశారు.
‘‘ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? అని సీఎం ప్రశ్నించారు.