ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.! ఏపీకి లాభమేంటి.?

దావోస్ పర్యటన ముగించుకుని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారట. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలన్నీ వైఎస్ జగన్ కలిసే అవకాశం వుందట.

బాత్రూమ్‌లలోనూ, సోఫాల కిందా కూర్చుని వైఎస్ జగన్, నరేంద్ర మోడీ ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా వినే బ్యాచ్ సిద్ధం.. అంటూ వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ‘నాకౌట్ పంచ్’ వదిలారు. నిజమే, జగన్ ఎప్పుడు ఢిల్లీ టూర్ వెళ్ళినా, టీడీపీ అనుకూల మీడియాలో వెకిలి రాతలు వస్తుంటాయి.

ఇక్కడ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళడంలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. అక్కడ, ఆ ఇద్దరి మధ్యా ఏం చర్చ జరిగింది.? అన్నదానిపై అధికారిక ప్రకటన ఇరు వర్గాల నుంచీ రావాల్సి వుంది.
కేంద్రానికి, రాష్ట్రం తరఫున ఏం నివేదించారు.? కేంద్రం, రాష్ట్రానికి ఏం ఇవ్వనుంది.? అన్న విషయాలపై అసలు స్పష్టతే లేకుండా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలు గడచిన మూడేళ్ళుగా జరుగుతున్నాయి.

‘ప్రత్యేక హోదా అడుగుతూనే వుంటాం..’ అని మాత్రం వైఎస్ జగన్ పదే పదే చెబుతుంటారు. పోలవరం ప్రాజెక్టు మాటేమిటి.? రైల్వే జోన్ వ్యవహారమేమైంది.? విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా.? రాజధానిపై స్పష్టత ఏదీ.? ఇలాంటి అంశాలపై కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన సమాధానం రాబట్టలేకపోవడం శోచనీయం.

ఇంకా ఎన్నాళ్ళిలా.? గతంలో చంద్రబాబు హయాంలోనే కాస్త బెటర్. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు ఎవరో ఒకరు సీఎం ఢిల్లీ పర్యటనలో కనిపించేవారు. రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేస్తున్నట్లు చెప్పేవారు. ఇప్పుడు ఆ మాటలు చెప్పే కేంద్ర మంత్రులూ కరవయ్యారు.