మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల చేరుకున్న సీఎం జగన్ రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని.. ఆర్టీసీ బస్టాండ్, డిపోలకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక దేవాలయాల అభివృద్ధి, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీం, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించారు.
బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ …వచ్చే ఫిబ్రవరిలో వైఎస్ఆర్ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 5 సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అదనపు భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ‘వేంపల్లిలో డిగ్రీ కాలేజీకి నూతన శాశ్వత భవనాలను ఏర్పాటు చేస్తాం. నల్లపల్లిచెరువుపల్లిలో 130 కేవీ సబ్ స్టేషన్‌తో 14 గ్రామాలకు మంచి జరుగుతుంది. వేంపల్లిలో కమ్యూనిటీ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతున్నాం. పులివెందులలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. 18 కొత్త దేవాలయాలు, 51 దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వేంపల్లి ఉర్దూ కళాశాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ పనుల పురోగతి మరింత వేగవంతంగా సాగుతున్నాయి.పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.