CM Jagan : అప్పట్లో కొడాలి నాని.. ఇప్పుడేమో గుడివాడ అమర్నాథ్.. వైసీపీలో ‘బూతులకు’ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు. సరే, కొడాలి స్థాయిలో గుడివాడ అమర్నాథ్ ఇంకా బూతుల్లో ప్రావీణ్యం సాధించలేదా.? అంటే, అది వేరే చర్చ. అంబటి రాంబాబు కూడా తక్కువేం కాదు.. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడంలో.
రాజకీయాల్లో తమ పార్టీని గట్టిగా సమర్థించడం వేరు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డం వేరు. అధికారంలో వున్నప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకపోతే, ఏం జరుగుతుందో 2019 ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఫలితాన్ని చూస్తే వైసీపీకి ఇట్టే అర్థమయిపోతుంది. కానీ, అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు.
అధినేత మెప్పు కోసం కింది స్థాయి నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ పార్టీలో అయినా ఈ తంతు మామూలే. కానీ, అధికార పార్టీలో.. అధినేత మెప్పు కోసం పాకులాడే నేతలు, ఆ అధినేతను అధికారానికి దూరం చేస్తున్నామన్న విషయాన్ని విస్మరిస్తుంటారు.. అదే అసలు సమస్య.
2024 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో వున్నామని వైసీపీ అధినేత చెబుతున్నారు. ఏ పార్టీకి అయినా ఆ స్థాయిలో ఖచ్చితమైన టార్గెట్ వుండాల్సిందే. కానీ, మంత్రులుగా వున్నవారు.. తమ శాఖల వ్యవహారాల గురించి తమకేమీ తెలియదని చేతులెత్తేస్తూ, విపక్షాలపై విరుచుకుపడ్డంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. అది అధికార పార్టీ కొంప ముంచుతుంది.
ఈ విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్, ముఖ్యమంత్రిగా తన మంత్రి వర్గంలో పని చేసేవారిని ‘అదుపులో’ పెట్టుకోవాల్సి వుంటుంది. అదే వైసీపీకి మంచిది. లేని పక్షంలో, 2024 ఎన్నికలు వైసీపీకి ఓ గుణపాఠంలా మిగిలిపోవచ్చు.