ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. తెలంగాణ రాష్ర్టం తరహాలోనే ఏపీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డెత్ రేట్ బెంబేలెత్తిస్తోంది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా! మహమ్మారి ఏదో రూపంలో కాటేస్తూనే ఉంది. ఇక రాజకీయ నాయకులను కరోనా వదిలిపెట్టలేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వాళ్ల చుట్టూ ఉండే సిబ్బంది గన్ మెన్లు సహా కాన్వాయ్ డ్రైవర్లు కరోనా బారిన పడ్డారు. అటు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కరోనా చుట్టేసింది. అందులో పనిచేస్తోన్న సిబ్బందికి కొవిడ్ సోకింది. వాళ్లంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ కడప పర్యటనలో భాగంగా నిర్వహించి కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు గన్ మెన్లకు కొవిడ్ సోకింది. దీంతో అంజాద్ భాషాని హెమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని రోజుల పాటు సీఎం జగన్ నిర్వహించే అన్ని పర్యటనలకు డిప్యూటీ సీఎంని దూరంగా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం నుంచి 28 రోజుల పాటు అంజాద్ భాషా హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు. చికిత్స కు అవసరమైన సాధారణ మందులను సమయానికి అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే నిర్ధారణలో భాగంగా ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలు అనంతరం దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో బిజీగా ఉండనున్న సంగతి తెలిసిందే. జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో నివాళులు అర్పించనున్నారు. అనంతరం పలు రకాల పనులకు సంబంధించి మీడియాతో సమావేశం కానున్నారు. నేటి పర్యటన, మీడియా సమావేశంలో భాగంగా సీఎం వెంట ఉండే ప్రజా ప్రతినిధులకు, నేతలకు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీప్యూటీ సీఎం, ఆయన గన్ మెన్లకు కరోనా సోకినట్లు బయట పడింది.