Cinema Tickets : సినిమా పేరుతో దోపిడీ.. ఎంతవరకు సమంజసం.?

Cinema Tickets : కరోనా కారణంగా సినిమా థియేటర్ల వ్యాపారం నష్టపోయిన మాట వాస్తవం. మరి, సామాన్యుడి పరిస్థితో.? సామాన్యుడేమో సినిమా థియేటర్ల యాజమాన్యాలకు వచ్చిన నష్టాన్ని అర్థం చేసుకోవాలి. సినిమా థియేటర్ల యాజమాన్యాలేమో సామాన్యుల్ని అర్థం చేసుకోవు.. అంతేనా.?

నిజమే, కరోనా పాండమిక్ నేపథ్యంలో అన్ని రంగాలూ ఇబ్బందులు పడ్డాయి, పడుతున్నాయి. ఇలాంటప్పుడే, ‘విన్ విన్’ పరిస్థితులు వుండాలి. కానీ, తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి. కొందరైతే మరీ దారుణంగా పెంచేశారు. మల్టీప్లెక్స్ థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడాలంటే మూడొందలు వదిలించుకోవాల్సిందే. ఇదెక్కడి దోపిడీ.?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై దుమారం చెలరేగుతున్న విషయం విదితమే. అతి వృష్టి, అనావృష్టి.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అక్కడేమో థియేటర్లు నష్టపోతున్నాయ్.. ఇక్కడేమో ప్రేక్షకులు నష్టపోతారు. ఇలాగైతే, సినిమా పరిశ్రమ నిలదొక్కుకునేదెలా.?

చిన్న సినిమాల కోసం ఎక్కువ ఖర్చు చేసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళే పరిస్థితి తెలంగాణలో వుండదు. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లలో సౌకర్యాలు ఇకపై మెరుగుపడే అవకాశం వుండదు. వెరసి, సినిమా రంగం దారుణంగా నష్టపోయే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నాయి.

ఇప్పటికే సినిమా మీద ఆసక్తి జనాల్లో తగిపోయింది.. కరోనా కారణంగా. ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల పుణ్యమా అని కాస్త ఊపు వచ్చిందనుకునేలోపు టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఓ నెల రోజుల తర్వాత ఓటీటీలో సినిమా చూసుకోవచ్చన్న నిర్ణయానికే ప్రేక్షకులు వచ్చేయాలి.. తప్పదంతే.