Cinema Tickets : కోవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెద్ద సినిమాల విడుదలలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అనుకూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అవుతున్నట్లే కనిపిస్తోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల లొల్లిపై ఇంకా స్పష్టత రాలేదు. అక్కడ ఇంకా నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదల ఎలా.? అన్న అనుమానం, ఆందోళన సినీ పరిశ్రమలో కనిపిస్తోంది.
‘భీమ్లానాయక్’ సిద్ధంగా వుందనీ, సినిమా ఎప్పుడు విడుదలవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనని బట్టి వుంటుందని ఆ చిత్ర నిర్మాత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, టిక్కెట్ల ధరల్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంలేదు.
మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయినా, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినా, ఇప్పటిదాకా ‘సానుకూల ఫలితం’ అయితే రాలేదు. సినిమా టిక్కెట్ల విషయమై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. దాన్నుంచి కూడా సినీ పరిశ్రమకు తీపి కబురు అందలేదు.
తెలంగాణలో మాత్రం, సినీ పరిశ్రమకు సానుకూల వాతావరణమే వుంది. తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు పెరగడం, సినీ పరిశ్రమలో కాస్త ఉత్సాహాన్నే నింపుతోంది. ఆయినాగానీ, ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల లొల్లి సినీ పరిశ్రమకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.