Cinema Ticket Price : సినిమా టిక్కెట్టు.. బొప్పి కట్టేట్టు.! జగన్ సర్కారుకి షాక్.!

Cinema Ticket Price : సినిమా టిక్కెట్ల ధరల విషయమై వైఎస్ జగన్ సర్కారు ఎందుకు ‘పంతం’ పట్టిందన్నదానిపై అధికార వైసీపీ నేతల్లోనే అస్పష్టత వుంది. నిజమే, సగటు సినీ ప్రేక్షకుడికి సినిమా వినోదం దూరమవుతోంది.. అధిక టిక్కెట్ ధరల కారణంగా. బ్లాక్ మార్కెట్‌లో తొలి రోజు, తొలివారం సినిమా టిక్కెట్ ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయ్.

కానీ, ఆ బ్లాక్ టిక్కెట్ దందాని అరికట్టాల్సిన వైఎస్ జగన్ సర్కార్, ఆ దిశగా సరైన చర్యలు చేపట్టలేకపోతోందన్న విమర్శలున్నాయి. ఇంకోపక్క, తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. అలాంటప్పుడు, సినిమా నిర్మాణ వ్యయంతోపాటే, సినిమా టిక్కెట్ ధర కూడా పెరిగితే తప్పేంటన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సినిమా థియేటర్ యెదుట వుండే చాయ్ దుకాణం దగ్గర టీ, కాఫీ ధరలు పెరిగాయి.. టిఫిన్ సెంటర్లలో అన్ని ధరలూ పెరిగాయి. సినిమా థియేటర్‌కి వెళ్ళేందుకు వాహనాల్లో వెళితే, పెట్రోల్ అలాగే డీజిల్ ధరలూ పెరిగాయి.. చెప్పుకుంటూ పోతే, అన్ని ధరలూ పెరిగాయి.. కానీ, సినిమా టిక్కెట్ ధర తగ్గిస్తామంటే ఎలా.?

అస్సలేమాత్రం సమంజసంగా లేని ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్ సర్కారుకి, రాష్ట్ర హైకోర్టులో తాజాగా షాక్ తగిలింది. సినిమా టిక్కెట్ ధరల్ని తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోని రాష్ట్ర హైకోర్టు కొట్టి పారేసింది.

థియేటర్ల యాజమాన్యాలు ఈసారి కోర్టును ఆశ్రయించి, తమ వాదనను సమర్థవంతంగా వినిపించాయి. ప్రభుత్వ వాదనలో పస లేకపోవడంతో, తీర్పు.. సినిమా థియేటర్ల యాజమాన్యాలకు అనుకూలంగా వచ్చిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

మొత్తమ్మీద, సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలకు ఇది నిజంగానే తీపి వార్త. తొలి రోజు, తొలి వారం సినిమా టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు వెసులుబాటు దొరికినట్లయ్యింది హైకోర్టు తీర్పుతో.