ఒకటా.? రెండా.? చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. మామూలుగానే పవన్ కళ్యాణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తంటారు. ఏడాదికి ఓ సినిమా ఆయన్నుంచి రావడమే చాలా కష్టమైన వ్యవహారం. అలాంటిది, ఐదారు సినిమాలకు ఒకేసారి కమిట్ అయితే, వాటిని ఎప్పటికి పూర్తి చేయాలి. నిజానికి, పవన్.. కాస్త భిన్నంగానే ఆలోచించి, వేగంగా సినిమాలు చేసెయ్యాలనుకున్నారు. కానీ, అనూహ్యంగా కరోనా పాండమిక్ వచ్చి దెబ్బకొట్టింది. లేదంటే, ఈపాటికి రెండు మూడు సినిమాలు పవన్ నుంచి వచ్చి వుండేవే.
సినిమాలిలా ఆలస్యమవుతోంటే, రాజకీయ పార్టీని నడిపేదెలా.? నిఖార్సయిన రాజకీయాలు చేసేదెలా.? ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మదిని తొలిచేస్తున్న అంశం. చాలా సినిమాలకు కమిట్ అయిపోయిన దరిమిలా, నిర్మాతలు నష్టపోకూడదు.. అభిమానులూ హర్ట్ అవకూడదు. ఖచ్చితంగా సినిమాలు చేయాల్సిందే. అదే సమయంలో రాజకీయాల్లోనూ యాక్టివ్ అవ్వాలి. 2024 ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధమవ్వాలంటే ఇప్పటినుంచే పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందడుగు వేయాలి. కానీ, పరిస్థితులు అస్సలేమాత్రం సహకరించడంలేదాయనకి.
ఎడా పెడా షూటింగ్స్‌లో పాల్గొని, ఆ వెంటనే రాజకీయ పరమైన సమావేశాల్ని పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించాలంటే ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. ఇక, జనంలోకి వెళ్ళడం అనేది మరో సమస్య. మరెలా.? రెండు పడవల మీద ప్రయాణం తన తమ్ముడు ధైర్యంగా చేయగలడని కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేయాలనుకున్నారు.. చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ, రాజకీయాల్లో ప్రతి క్షణం చాలా విలువైనది. అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతే, రాజకీయంగా ఎదగడం అసాధ్యం. కానీ, సినిమా కోసం రాజకీయ అవకాశాల్ని పవన్ వదిలేసుకోక తప్పడంలేదు. అదే అభిమానుల్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.