Cinema Industry : కోవిడ్ 19: సినిమా పరిశ్రమకు బాధ్యత వుండక్కర్లేదా.?

Cinema Industry : ‘ఈ సమయంలో సినిమాల్ని రిలీజ్ చేసుకోవడమెందుకు.? మా సినిమా చూసేందుకు థియేటర్లకు రండి.. అని ప్రేక్షకుల్ని పిలవడమంటే, కోవిడ్ 19 మహమ్మారికి వాళ్ళని బలిచ్చేందుకేనా.? ఇదెక్కడి వింత.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది.

సంక్రాంతి రేసు నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు కోవిడ్ 19 తీవ్రత కారణంగా తప్పుకున్నాయి. అంతకు ముందే ‘భీమ్లానాయక్’ సినిమాని కొందరు తప్పించేశారు. అయితే, ‘బంగార్రాజు’ సహా కొన్ని సినిమాలు మాత్రం ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి.

సినిమా అంటే వ్యాపారం. ఆ వ్యాపారానికి ప్రభుత్వాలు అనుమతిచ్చిన దరిమిలా, సినిమా ప్రదర్శన విషయమై నిర్మాతల్నిగానీ, నటీనటుల్నిగానీ తప్పు పట్టలేం. సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు, నటీనటులు.. ప్రాణాలకు తెగిస్తున్నారనే చెప్పాలి.

కానీ, కరోనా వేళ సినిమాల విడుదల ఎంతవరకు సబబు.? అన్న విమర్శ మాత్రం సినీ పరిశ్రమ మీద పెద్దయెత్తున వినిపిస్తోంది. అయితే, కోవిడ్ 19 తీవ్రత పెరుగుతున్న దరిమిలా, బరిలో నిలిచిన సినిమాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాయిదా ప్రకటనలు వస్తూనే వున్నాయి. తాజాగా ఎంఎస్ రాజు సినిమా కూడా వెనక్కి వెళ్ళింది.
జనవరి 13 నుంచి సినిమాల విడుదలలున్నాయి. సో, అప్పటికల్లా పరిస్థితులు మరింత దారుణంగా తయారైతే, ఏ సినిమా కూడా థియేటర్లలో విడుదల కాకపోవచ్చు. ఈలోగా తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే, కోట్లు ఖర్చు చేసేశారు ఆ సినిమాల మీద. వాయిదా పడితే, కోట్లలోనే నష్టం వస్తుంది మరి.