చిరంజీవి ఆశయం పవన్ కళ్యాణ్‌తో నెరవేరుతుందా.?

 

రాజకీయాల్లో మార్పుని ఆకాంక్షించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. కానీ, చిరంజీవి ఆశయం నెరవేరలేదు. ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాధించలేకపోయింది. నిజానికి, ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో మంచి అవకాశాలే వుండేవి. కానీ, చిరంజీవి ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సినీ రంగంలో ఎదగడానికి కష్టపడినట్లుగా, రాజకీయాల్లో చిరంజీవి ఎందుకో ఒడిదుడుకుల్ని ఎదుర్కోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం. అన్నయ్య చిరంజీవి భద్రతా వ్యవహారాలు సహా, పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకున్నారు. అయితే, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి పవన్ కాస్త దూరంగా వుండిపోవాల్సి వచ్చింది.

చివరికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. ఆ విలీనాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా చెబుతారు. అది గతం. చిరంజీవి మాత్రం జనసేన పార్టీకి మద్దతుగా నినదించలేకపోయారు, ఆ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు కూడా. కానీ, ‘తోడబుట్టిన ఆశయం’ అంటూ చిరంజీవి, తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేస్తూ పేర్కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిరంజీవి ఆశయం, రాజకీయాల్లో ‘మార్పు’. అది జనసేన ద్వారా సాధ్యమవుతుందా.? అంటే, ‘నేను సాధించలేకపోయాను.. కానీ, నా తమ్ముడు సాధించగలడన్న నమ్మకం నాకుంది..’ అని గతంలోనే ఓ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ సామర్థ్యాల గురించి చెప్పకనే చెప్పారు. కానీ, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే తీసికట్టులా తయారైంది జనసేన పరిస్థితి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. ఈక్వేషన్స్ ఎప్పుడెలా రాజకీయాల్లో మారతాయో చెప్పలేం. చిరంజీవి ‘ఆశయం’ అంటూ పెద్ద పదమే వాడారంటే, జనసేన భవిష్యత్తు ఆయనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నట్టే లెక్క.