మెగాస్టార్ చిరంజీవి ముందున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం.. సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట నడవడమే. జనసేన పార్టీలో చిరంజీవి అధికారికంగా చేరతారా.? లేదా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా ఇద్దరి ఆలోచనలు వేరు. మేమిద్దరం కలిసి రాజకీయంగా ప్రయాణించడం కుదరకపోవచ్చు. కానీ, మా లక్ష్యం మాత్రం ఒకటే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. అసలు రాజకీయాలపై ఒకప్పటి ఆసక్తి ఇప్పుడు నాకు లేదు.
కానీ, నా తమ్ముడికి నా ఆశీస్సులు వుంటాయి. రాజకీయంగా ఉన్నత స్థానానికి నా తమ్ముడు చేరుకోవాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడి పట్టుదల నాకు తెలుసు. వాడు తప్పక విజయం సాధిస్తాడు.. కోరుకున్నది దక్కించుకుంటాడు..’ అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే, చిరంజీవిపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా చిరంజీవికి ప్రతిపాదనలు వస్తున్నాయట.. రాజ్యసభ పదవి విషయమై. దాంతో, చిరంజీవి ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ సర్వ్రతా జరుగుతోంది.
చిరంజీవి వైపు నుంచి మాత్రం, అదంతా ట్రాష్.. అనే సంకేతాలు వస్తున్నాయి. అసలేం జరుగుతోంది.? అనే విషయాన్ని పక్కన పెడితే, మెగా ఫ్యాన్స్ మాత్రం.. అన్నదమ్ములిద్దరూ రాజకీయంగా ఒక్కటవ్వాలనే కోరుకుంటున్నారు. చిరంజీవి గనుక, జనసేన వైపుకు వెళితే.. ఈసారి బలం అనూహ్యంగా పెరగబోతోంది జనసేన పార్టీకి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు.. రెండు వేర్వేరు పరిస్థితులు. ఇలాంటప్పుడు, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వుంటేనే మెగా కాంపౌండుకి మంచిదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏమో, చిరంజీవి ఎలాంటి నిర్ణయం రానున్న రోజుల్లో తీసుకుంటారో వేచి చూడాల్సిందే.