గ్రేటర్ ఎన్నికల సమరంలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ తమ శక్తికి మించి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా తెరాస , బీజేపీ పార్టీలు ఈ సమరంలో నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి, గ్రేటర్ గెలిచి తమ సత్తా నిరూపించాలని బీజేపీ, మరోసారి బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగరవేసి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని తెరాస వ్యూహాలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలో మెగా బ్రదర్స్ ఇద్దరు ఈ రెండు పార్టీల తరుపున ఈ గ్రేటర్ ఎన్నికల్లో కీలక రోల్ పోషిస్తున్నారు.
రంకెలేసి రాజీకొచ్చిన జనసేనాని
గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయబోతుందని కమిటీలను ప్రకటించి, కార్యకర్తలను అందుకు సిద్ధం చేసిన జనసేనాని ఆ తర్వాత ఒక రెండు రోజులు కీలక డ్రామాలు నడిపించి గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేయటం లేదు, ఈ ఎన్నికల్లో మిత్రపక్షము బీజేపీకి మద్దతు ఇస్తున్నామంటూ చెప్పటం జరిగింది. మొదటి నుండి మిత్ర పక్షమని చెప్పుకుంటున్న బీజేపీతో గ్రేటర్ ఎన్నికలంటే ముందే పోటీ గురించి ఎందుకు మాట్లాడుకోలేదు..? కనీస అవగాహనా అనేది లేకుండా పోటీకి దిగబోతున్నాం అంటూ ప్రకటించటం ఏంటి..? ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ జనసేనతో అసలు మాకు పొత్తు ఆలోచనే లేదని బహిరంగంగా పరువు తీసేసిన తర్వాత కిషన్ రెడ్డి లాంటి నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, రాజీకొచ్చి పోటీ నుండి గౌరవంగా తప్పుకుంటూ కమలానికి మద్దతు ఇచ్చాడు..
కారెక్కిన మెగాస్టార్
మరోపక్క పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి బహిరంగంగా తెరాస కు ఓట్లేయమని చెప్పలేదు కానీ, నిన్న మాట్లాడుతూ ” కరోనా తో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం శ్రీ కెసిఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, చిన్న సినిమాలకు రాష్ట్ర GST రీఎంబర్స్మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియోటర్లుకు విద్యుత్ కనీస డిమాండ్ చార్టీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియోటర్స్ లో షోలను పెంచుకుందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్ణాటక, ఢీల్లీలో ఉన్న విధంగా టిక్కెట్లు ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో, అయన విజన్ కు తగ్గట్లు తెలుసు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది” అంటూ ఒక పోస్ట్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు . దీనిని బట్టి చుస్తే చిరంజీవి మద్దతు కేసీఆర్ కు ఉన్నట్లు తెలుస్తుంది. సరిగ్గా గ్రేటర్ ఎన్నికలకు ముందు చిరంజీవి నుండి ఇలాంటి పోస్ట్ రావటం ఒక వ్యూహం ప్రకారమే జరిగిందని అనుకోవాలి.
అంతిమ లాభం వాళ్ళకే
కమలం వైపు పవన్ కళ్యాణ్,. కారు వైపు చిరంజీవి మద్దతు ప్రకటిస్తున్నారు, పవన్ కళ్యాణ్ మాదిరి చిరంజీవి ఎన్నికల ప్రచారం లాంటివి చేయకపోయినా ట్విట్టర్ లాంటి వేదికలో తెరాస కు సపోర్ట్ గా మాట్లాడటం ఆ పార్టీకి మేలు చేస్తుంది. ఇలా చేయటం వలన రాబోయే అనేక సమస్యల నుండి మెగా ఫ్యామిలీ సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వలన తెరాసకు మెగా ఫ్యామిలీ దూరం కావటం ఖాయం. అదే కనుక జరిగితే సినీ పరంగా ఇబ్బందులు తప్పవు, అది దృష్టిలో పెట్టుకొని మరోపక్క చిరంజీవి తెరాస కు మద్దతు గా మాట్లాడటం జరిగింది. అంటే తమ్ముడి వలన కలిగే ఇబ్బందులను అన్నయ్య సరిచేస్తున్నాడు. రేపొద్దున్న సినిమా పరంగా ఎలాంటి మద్దతు కావాలన్నా చిరంజీవి తరుపు నుండి సాధించుకునే అవకాశం మెగా ఫ్యామిలీకి ఉంది. అన్నదమ్ములు ఒక వ్యూహం ప్రకారమే గ్రేటర్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది, బహుశా అసలైన రాజకీయం అంటే ఇదే కాబోలు..