ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా దాసరి నారాయణరావుగారు ముందుండి చూసుకునే వారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. ఆయన కాలం చేశాక ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. ప్రతి సమస్యకు ముందుండి స్పందిస్తున్నారు. కోవిడ్ కారణంగా మూతబడిన పరిశ్రమను తిరిగి గాడిలో పడేలా చేయడం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చర్చలు జరిపారు. లాక్ డౌన్ సమయంలో విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. అంతేకాదు కార్మికులకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం చేశారు. అంతర్గత సమస్యల పట్ల స్పందిస్తూనే ఉన్నారు.
ఇక పరిశ్రమలో ఎవరికైనా వ్యక్తిగత సమస్య అంటూ వస్తే నేరుగా స్పందిస్తున్నారు. తాజాగా హీరో జూ.ఎన్టీఆర్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిరు నేరుగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి యోగ క్షేమాలు వాకబు చేశారు. తారక్ అన్ని జాగ్రత్తలు తీసుకుని హోమ్ క్వారంటైన్లో ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారని, మాట్లాడేటప్పుడు తారక్ ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా ఉన్నారని అనిపించి హ్యాపీగా ఫీలయ్యానని, తారక్ త్వరలోనే కొలుకుంటాడని అన్నారు చిరు. ఆయన మాటలతో తారక్ అభిమానులకు బోలెడంత రిలీఫ్ లభించింది. మొత్తానికి చిరు ఒక పెద్ద దిక్కుగా అందరి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.