పవన్ కళ్యాణ్‌కి చరణ్ ‘మీడియా సపోర్ట్’.. నిజమెంత.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడున్న మీడియాలో చాలావరకు రాజకీయ పార్టీల పెత్తనం సుస్పష్టం. ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఆయా మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు నేరుగా మీడియా సంస్థలుంటే, కొన్ని రాజకీయ పార్టీలు.. ఆయా మీడియా సంస్థల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమో, వాటి ద్వారా తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడమో చేస్తున్నాయి. మరి, జనసేన పార్టీ సంగతేంటి.? జనసేన పార్టీకి మద్దతుగా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నా, వాటి ప్రభావం చాలా చాలా తక్కువ. అందుకే, ఓ పెద్ద మీడియా పవర్, జనసేనకు అండగా వుండాలనే ఆలోచన జనసైనికుల్లో ఎప్పటినుంచో వుంది. మెగా కాంపౌండ్ కూడా అలాంటి ఆలోచన ఎప్పటినుంచో చేస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది.

గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ఓ ప్రముఖ ఛానల్‌ని కొనుగోలు చేసేస్తున్నారనే ప్రచారం మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో నిజమెంత.? అంటే, చరణ్ ఇప్పటికే పలు రకాల వ్యాపారాల్లో భాగస్వామిగా వున్నాడు. సో, ఆయన మీడియా రంగంలోకీ అడుగు పెట్టినా వింతేమీ వుండకపోవచ్చు. అయితే, న్యూస్ ఛానళ్ళు లేదా పత్రికల్ని నడపడం ఈ రోజుల్లో అంత తేలిక కాదు. వాటికి రాబడి గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వాల మద్దతు లేకుండా న్యూస్ ఛానళ్ళు లేదా పత్రికల్ని నడపడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, ప్రభుత్వ ప్రకటనలే ఆయా మీడియా సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా వుంటోన్న రోజులివి. జనసేన కోసం ఓ ప్రముఖ పత్రిక, ఓ ప్రముఖ ఛానల్ అవసరమే. పవన్ కళ్యాణ్ కోరుకుంటే, ఆయన కోసం ఆ రంగం నుంచి మద్దతు కోసం కొందరు ప్రముఖులు ఎదురుచూస్తున్నారు కూడా. కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అనీ.. ఆ బలం జనసేనకు సరిపోతుందని పవన్ భావిస్తున్నారట.