ప్యాకేజ్డ్ ఫుడ్ తినే ముందు.. ఈ విషయాలు తప్పనిసరిగా చెక్ చేయండి.. లేకపోతే..!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి నిమిషం విలువైనదిగా మారిపోయింది. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ట్రాఫిక్ వంటివి మధ్యలో ఎక్కువసేపు వంటకు కేటాయించడం చాలామందికి అసాధ్యంగా మారింది. దాంతో రెడీమేడ్ ఆహారాల వైపు మనం అడుగులు వేస్తున్నాం. కానీ ఇవి తక్కువ సమయాన్ని కాపాడేలా కనిపించినా, ఆరోగ్యానికి హాని కలిగించేవిగా మారిపోయాయి. ముఖ్యంగా ప్యాకేజింగ్ ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాటిని తినే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను చెక్ చేయడం మన ఆరోగ్య రక్షణకు కీలకం.

ముందుగా గమనించాల్సింది ఎక్స్‌పైరీ డేట్. ప్రతి ఫుడ్ ప్యాకెట్ మీద గడువు తేదీ తప్పనిసరిగా ముద్రించబడుతుంది. ఆ తేదీ దాటి తింటే ఆ ఆహార పదార్థం విషంగా మారే అవకాశముంది. ప్యాకెట్ కనిపించేదిలా ఉందని మోసపోకుండా, ఎప్పటికీ ముందుగా డేట్ చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత చూస్తే పోషకాహార సమాచారమే. ప్యాకెట్ మీద ఉండే ‘న్యూట్రిషన్ ఫాక్ట్స్’ లేబుల్ లో క్యాలొరీస్, కొవ్వులు, చక్కెర, ప్రోటీన్లు వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్ లేకుండా ఉండే ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతాయి.. అలాగే RDA – అంటే రెకమెండెడ్ డైటరీ అలవెన్స్ స్థాయిలను చూసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనవి అందుతున్నాయా లేదా అనే అవగాహన వస్తుంది.

ఇంకొక ముఖ్యమైన అంశం ప్యాకేజింగ్ నాణ్యత. ప్యాకెట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉందా లేదా చూసుకోవాలి. లీకేజీ, ఉబ్బిన ప్యాకెట్, తడి పడి ఉండటం వంటి సమస్యలు ఉంటే వెంటనే దానిని వాడకుండా పక్కన పెట్టాలి. అంతేకాదు.. ఆ ప్యాకెట్‌పై FSSAI అనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది కదా అని చెక్ చేయాలి. ఇది ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది.

చివరిగా ఆ పదార్థం తయారీకి ఉపయోగించిన పదార్థాల జాబితా కూడా చదవాలి. కొన్నిసార్లు అందులో అలెర్జీకి కారణమయ్యే పదార్థాలు, ఆర్టిఫిషియల్ కలర్స్, రుచి కోసం వేసే కెమికల్స్ వంటి వాటిని కలిపే అవకాశముంటుంది. ఇవి తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోనల్ డిస్టర్బెన్స్, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంతవరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఒక్క ప్యాకెట్ మనకు సమయాన్ని కాపాడొచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివి తీసుకునే ముందు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.