ప్రచారమెందుకు బాబూ.. పరువు తీసుకోవడానికా.?

Chandrababu's Municipal Election campaign started

Chandrababu's Municipal Election campaign started

పంచాయితీ ఎన్నికల్లో ఏమయ్యిందో చూశాం.. మునిసిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతోందో ముందే అర్థమయిపోయింది. కానీ, పరువు నిలుపుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం షురూ చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా అదే పనిలో వున్నారు. నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నవ్వులపాలైపోతోంది తప్ప, ఆ ప్రచారం వల్ల టీడీపీకి ఇసుమంతైనా లాభం లేని పరిస్థితి కనిపిస్తోంది. 1978లో వాజ్‌పేయి ప్రధాని..అంటూ నారా లోకేష్ చేసిన కామెడీతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశాఖలో అవాక్కయ్యాయి. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల్లో చాలావరకు వైసీపీకి ఏకగ్రీవాలయ్యాయి. మిగతా చోట్ల పరువు నిలబెట్టుకోవాలంటే టీడీపీ హుందాగా వ్యవహరించాలి. కానీ, ఆ పరిస్థితే కనిపించడంలేదు. నిజానికి, చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం, తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి వ్యక్తమవుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అధికారం కోల్పోయాక అత్యంత వ్యూహాత్మకంగా పార్టీ పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సిన చంద్రబాబు, పార్టీ నుంచి నేతల్ని బయటకు వెళ్ళిపోతుంటే చేష్టలుడిగా చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. పంచాయితీ ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టో నవ్వులపాలైపోయిదంటే, చంద్రబాబు రాజకీయ అనుభవం ఏపాటిది.? అనేది అర్థమయ్యింది చాలామందికి.

ఇవి చిన్న చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద పొరపాట్లు. పంచాయితీ ఎన్నికలు కావొచ్చు, మునిసిపల్ ఎన్నికలు కావొచ్చు.. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వున్న సమస్యల్ని అడ్రస్ చేయగలిగితే, తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో అయినా పుంజుకుంటుంది. కానీ, ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ తన బాధ్యతల్ని విస్మరిస్తోంది. ప్రజలతో కనెక్ట్ అవడం అనే కాన్సెప్టునే చంద్రబాబు పట్టించుకోవడంలేదు. అలాంటప్పుడు ప్రచారమెందుకు దండగ.? రేప్పొద్దున్న మునిసిపల్ ఎన్నికల్లో ఎదురవబోయే పరాభవం తెలిసీ ప్రచారంలోకి దిగడమంటే హాస్యాస్పదమే మరి.