వైసీపీ ఫ్లెక్సీ లో జగన్ పక్కన చంద్ర బాబు ఫోటో !

వైకాపా-టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఆ రెండు పార్టీల నేత‌ల‌కు ఒక‌రంటే ఒక‌రు అస్స‌లు ప‌డ‌దు. సీఎం జ‌గ‌న్ పేరేత్తితే టీడీపీ నేత‌లు అంతెత్తున లేచి ప‌డ‌తారు. అదే రేంజ్ లో చంద్ర‌బాబు నాయుడు పేరెత్తినా వైకాపా నేత‌లు మండి ప‌డ‌తారు. రెండు పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ఈనాటిది కాదు. ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతోన్న వైరం అది. రెండు పార్టీలు చిన్న చిన్న విష‌యాల్లో సైతం త‌ప్పులు దొర్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. ఆ లెక్క‌న చూసుకుంటే వైకాపా చాలా పెద్ద త‌ప్పే చేసింద‌నాలి. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త అంబులెన్స్ ల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 1000కి పైగా వాహ‌నాల‌కు ప‌చ్చ జెండా ఊపి విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా ప్రారంభించారు.

ఇది వైకాపా రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఓ సువర్ణాద్యాయంగా నిలిచిపోతుంది. దీనిలో భాగంగా తిరుప‌తిలో చేపట్టిన 104, 108 వాహ‌నాల ర‌థ‌యాత్ర ప్రారంభ స‌మావేశం ఏర్పాట్ల‌లో పెద్ద త‌ప్పిద‌మే జ‌రిగింది. స‌మావేశ వేదిక‌కు ప‌క్క‌న ఏర్పాటు చేసిన ప్లెక్లీలో ముఖ్య‌మం త్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్క‌న కొంచెం చిన్న‌దిగా మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఫోటో పెట్టారు. ప్లెక్సీకి మ‌రోవైపు దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్  ఫోటోల‌ను పెట్టారు. వైకాపా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ఫోటోలో చంద్ర‌బాబు నాయుడు ఫోటో పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చంద్ర‌బాబు ఫోటో పొర‌పాటున అక్క‌డ ప్రింట్ అయిందా? లేక వైకాపా నేత‌లే కావాల‌ని ఆయ‌న్ని విమ‌ర్శించాల‌ని అచ్చు వేయించారా? అంటూ బ‌య‌ట మాట్లాడుకుంటున్నారు. చంద్ర‌బాబు నాయుడు 2014 లో అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్ల పాటు అంబులెన్స్ లు న‌త్త‌న‌డ‌క‌న సాగిన మాట వాస్త‌వం. బీవీజీ సంస్థ వాటి మెయింట‌నెన్స్ ని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. ఉన్న పాత వాహ‌నాల‌నే తూతూ మంత్రంగా న‌డిపింది త‌ప్ప‌! రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగితే పోయేది ఎవ‌రి ప్రాణం అన్న‌ట్లే వ్య‌వ‌రించించి. ఆ త‌ప్పుల‌న్నింటిని ఎత్తి చూపించ‌డం కోసం కావాల‌ని చంద్ర‌బాబు ఫోటో ప్లెక్సీ మీద తిరుప‌తి వైకాపా నేత‌లు వేయించిన‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు.