నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు దన్యుడు సుమతి అన్నారు వేమనగారు. అయితే ఈలోకంలో ఎంత తప్పించుకు తిరిగినా ఇరికించేస్తారు. బంధం, అనుబంధం, మొహమాటం, ఇలాంటివి వర్క్ అవుట్ కాకపోతే పదవులు, సెంటిమెంట్లు ఇలా ఏదో ఒకటి… తమ కింది వాళ్లను తమ దగ్గరే అట్టిపెట్టుకునేందుకు పెద్ద మనుషుల దగ్గర ఉన్నన్ని అస్త్రాలు సామాన్యుడి దగ్గర ఉండవు. తాజాగా టీడీపీ వెలువరించిన రాష్ట్ర కార్యవర్గ జాబితా తీరే ఇందుకు నిదర్శనం.
టీడీపీ రాష్ట్ర కమిటీలో ఏకంగా 219 మందికి అవకాశం కల్పించారు పార్టీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 175 ఉంటే తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ జాబితా 219. అంటే టీడీపీ కార్యవర్గం సమావేశమైతే రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కన్నా ఎక్కువ ఏర్పాట్లు చేయాలన్నమాట.
వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారు. వైసీపీ నుంచి వేధింపులు వస్తాయన్న భయంతో చాలా మంది నేతలు మిన్నకుండిపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వీరిలో దైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కేసుల భయంతో చాలా మంది నేతలు మొహం చాటేశారు. దీంతో పదవుల ఆశ చూపి అందర్నీ కట్టి పడేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
అసంతృప్తితో ఉన్న వాళ్లను సంతోష పర్చడం, యాక్టివ్ గా లేని వాళ్లకు గాలం వేయడం. భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తాయన్న ఆశను క్యాడర్ లో రగిలించడం ఇలా ఒక్కటేమిటి… అందరిలో అన్ని రకాల ఆశలు చిగురించేలా చేశారు చంద్రబాబు. తాజాగా టీడీపీ ప్రకటించిన 219 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గానికి జాతీయ కార్యవర్గం అదనం. దీన్ని బట్టి చంద్రబాబు వైసీపీతో పోరుకు ఏ రేంజ్ లో ఫ్యూహ రచన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పదువులు దక్కించుకున్న వాళ్లలో కొంత మంది అత్యుత్సాహంతో అవసరానికి మించి రాద్దాంతం చేయడం ఖాయం. వైసీపీ వీళ్ల తాట తీయడం ఖాయం. ఇక అప్పుడు మళ్లీ చంద్రబాబు… ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ గొడవ చేయడం ఖాయం. ఇదండీ ఏపీలో రాజకీయాలు సాగుతున్న తీరుతెన్నులు.