18 నెలలయ్యింది అధికారంలోకి వచ్చి.. అమరావతి కుంభకోణమన్నావ్.. ఏం పీకావ్.?’ అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తన స్థాయిని మర్చిపోయి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద. అదే.. ఆ అత్యుత్సాహే చంద్రబాబు కొంప ముంచేస్తోందని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుస్సా అవుతున్నాయి. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ కేసులు నమోదు చేయడం, చంద్రబాబుకి నోటీసులు పంపడంతో మొత్తంగా పసుపుదళం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. రెచ్చిపోవడమెందుకు.?
ఇప్పుడిలా గగ్గోలు పెట్టడమెందుకు.? అన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే తమ అధినేత మీదనే జరుగుతోందట. ‘ఏం పీకావ్.?’ అని ప్రశ్నించారు గనుక, చంద్రబాబు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేననీ, లేనిపక్షంలో చంద్రబాబు విశ్వసనీయత మరింత దెబ్బ తింటుందనీ తెలుగు తమ్ముళ్లే ఒప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
ఏపీ సీఐడీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా హాజరవుతున్నారు. ఆయనకూ నోటీసులు వెళ్ళాయి ఈ కేసుకి సంబంధించి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు మీద మాటల యుద్ధానికి తెరలేపారు వైసీపీ నేతలు. ‘మా ఎమ్మెల్యేకి కూడా నోటీసులు వెళ్ళాయి. ఆయన కూడా విచారణకు హాజరవుతారు. మీరూ వెళ్ళి మీ సచ్ఛీలతను నిరూపించుకోండి. మీరు తప్పు చేయకపోతే, మీకు క్లీన్ చిట్ రావొచ్చు..’ అన్నది అధికార వైసీపీ, చంద్రబాబుకి ఇస్తోన్న ఉచిత సలహా. కానీ, చంద్రబాబు ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తోంది కూడా. మరి, ఈసారి అలా తప్పించుకునేందుకు చంద్రబాబుకి అవకాశం వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.