‘వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. అందుకే, ఏళ్ళ తరబడి చాలా కేసుల విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు..’ అనే ఆరోపణలు టీడీపీ అధినేత మీద ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే వున్నాయి. చంద్రబాబు మాత్రం, ‘నేను నిప్పు..’ అంటారు తప్ప, తన మీద ఏదన్నా విచారణ జరిగితే, దాన్ని ఎదుర్కొనలేరన్న వాదన వుంది.
సరే, అసలు విషయానికొద్దాం. అమరావతి భూముల వివాదానికి సంబంధించి, చంద్రబాబు మీద వైఎస్ జగన్ సర్కార్ కేసులు నమోదు చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దళితుల తరఫున అసైన్డ్ భూముల విషయమై ఫిర్యాదు చేశారు.. ఏపీ సీఐడీ ఈ కేసు విచారణ చేపట్టింది, చంద్రబాబుకి నోటీసులు ఇచ్చింది కూడా. ఈ నోటీసుల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే, చంద్రబాబు తనకు బాగా తెలిసిన వ్యూహాన్నే ఇక్కడా అమలు చేస్తున్నారు. ‘ఏపీ సీఐడీ నోటీసుల్ని నిలువరించాలంటూ హైకోర్టలో క్వాష్ పిటిషన్’ దాఖలు చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ‘మేం న్యాయస్థాన్ని ఆశ్రయిస్తాం.. అదొక సిల్లీ పిటిషన్.. దానికే నోటీసులు ఇచ్చేస్తారా.? కోర్టుల్లో మాకు న్యాయం జరుగుతుంది..’ అని టీడీపీ నేతలు ముందే సంకేతాలు పంపించేశారు.
మరిప్పుడు, న్యాయస్థానంలో ఏం జరుగుతుంది.? చంద్రబాబు కోరిక మేరకు, సీఐడీ జారీ చేసిన నోటీసుల్ని న్యాయస్థానం కొట్టి పారేస్తుందా.? లేదంటే, ‘విచారణకు హాజరైతే నష్టమేంటి.?’ అని చంద్రబాబుకే సూచిస్తుందా.? ఏమో, ఏదైనా జరగొచ్చు. అయినా, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో వున్న చంద్రబాబు, ఇలాంటి కేసుల సందర్భంగా విచారణకు హాజరైతే తప్పేంటట.? కేసులో విషయం లేకపోతే, ఎలాగూ కోర్టుల్లో అది వీగిపోతుంది. కానీ, ఇక్కడ చంద్రబాబుకీ కొన్ని భయాలున్నాయి. ఎలాగైనా చంద్రబాబుని అరెస్టు చేయాలన్న కసితో చంద్రబాబు వున్నారనే సమాచారం టీడీపీకి అందింది. అదీ అసలు సంగతి. అయితే మాత్రం, అలా అరెస్టయినా.. చంద్రబాబుకి ఫ్రీ పబ్లసిటీనేగా వచ్చేది.?