లాక్ డౌన్ తో గత రెండు నెలలకు పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు. అక్కడ నుంచే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ గ్యాస్ ఘటన తర్వాత బాధితుల్ని పరామర్శించే యత్నం చేసి ఎందుకనో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తర్వాత రాష్ర్టంలో రాజకీయాలు వేడెక్కడంతో హైదరాబాద్ నుంచే బాబు నేతల్ని కదిలించి రోడ్డెక్కించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో విశాఖ, అమరావతి పర్యటించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ పోలీస్ శాఖ అనుమతులు తీసుకున్నారు.
అక్కడ డీజీపీ చంద్రబాబుకు అనుమతిచ్చారు. అయితే ఏపీలో ఆయనకి అనుమతి దొరికిందా? లేదా? అన్న దానిపై నాటకీయత చోటు చేసుకుంది. ఇక్కడ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా స్పందించలేదని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. చంద్రబాబుపై కక్ష పూరితంగానే ప్రభుత్వం వ్యవరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా హోమంత్రి మేకతోటి సుచరితో దీనిపై స్పందించారు. చంద్రబాబు విశాఖ పర్యటనకి వైకాపా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆయన ధర్జాగా విశాఖ గ్యాస్ బాధితుల్ని పరామర్శించవచ్చు అన్నారు. అయితే ఆయన ఎపీ డీజీపీకి ఎప్పుడు లేఖ రాశారా? అని ప్రశ్నించారు.
డీజీపీకి దరఖాస్తు చేస్తే తగిన ఆధారాలు చూపించాలన్నారు. ఇక్కడ ప్రభుత్వానికి దరఖాస్తు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారని గుర్తు చేసారు. భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లు విశాఖ బాధితుల్ని పరామర్శించారని, వారిని ఎవరు అడ్డుకోలేదని మంత్రి చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని, ఆ పార్టీ నేతలే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ చంద్రబాబు పర్యటన ఉంటుందా? ఉండదా? అన్న దానిపై సరైన స్పష్టత లేదు.