పంచాయితీ ఎన్నికల సంబరం ముగిసింది.. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ముచ్చట తీరింది. మరి, పరిషత్ ఎన్నికల మాటేమిటి.? విపక్షాలెందుకు పరిషత్ ఎన్నికలు జరపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని కోరడంలేదు.? ‘కరోనా బూచిపై బ్రహ్మాస్త్రమైన వ్యాక్సిన్ పంపిణీ జరగాల్సి వున్నందున, స్థానిక ఎన్నికల్ని కొన్ని రెండు మూడు నెలల పాటు వాయిదా వేయాలి’ అని జగన్ సర్కార్ కోరితే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ససేమిరా అనేసింది.
విపక్షాలైతే నానా యాగీ చేశాయి. ఎన్నికలు జరగాల్సిందేనంటూ గగ్గోలు పెట్టాయి. సంబరం తీరిపోయింది.. ముచ్చట ముగిసింది.. విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు ఓటర్లు, ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో. పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఇంతకు భిన్నమైన ఫలితం వచ్చే అవకాశం వుందా.? ఇంకాస్త ఇమేజ్ అధికార పార్టీకే పెరగబోతోంది పరిషత్ ఎన్నికలతో. అదే భయం ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. అందుకే ఎక్కడా పరిషత్ ఎన్నికల గురించి టీడీపీ నేతలుగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుగానీ మాట్లాడటంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పూర్తిగా మొహం చాటేస్తున్నారు పరిషత్ ఎన్నికలకు సంబంధించి.
మరోపక్క, వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అధికార వైసీపీ ఈ విషయమై ఇప్పటికే ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి విజ్ఞప్తి చేసింది కూడా. అయితే, ప్రత్యేక సెలవుపై వెళ్ళాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, వేగంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసెయ్యాలన్నది ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్‌కి అందుతోన్న విజ్ఞప్తుల సారాంశం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అధికారుల సమావేశంలో ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు.