షర్మిలపై చంద్రబాబు ఘాటు కామెంట్స్.. అవసరమా.?

చంద్రబాబు ,షర్మిల

 

chandrababu harsh comments on YSR Sharmila

నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మహిళల విషయంలో అదుపు తప్పి రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేస్తే ఎలా.? వైఎస్ జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో రోడ్డుపై పడ్డారంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సోదరి షర్మిలకు వైఎస్ జగన్ ఆస్తులుగానీ, పదవులుగానీ ఇవ్వలేదు. దాంతో ఆమె తెలంగాణలో రోడ్డున పడింది..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘షర్మిల – జగన్’ మధ్య ఏం జరిగినా అది కుటుంబ వ్యవహారం. పైగా, తన సోదరుడు జగన్ మీద ఇప్పటిదాకా షర్మిల ఎక్కడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదు. తనకు తన సోదరుడి నుంచి మద్దతు వుంటుందని షర్మిల కుండబద్దలుగొట్టేస్తున్నారు. జగన్ సోదరిగా షర్మిలను గౌరవిస్తామని వైసీపీ నేతలూ చెబుతున్నారు. మరి, చంద్రబాబు.. స్వర్గీయ ఎన్టీఆర్ విషయంలో చేసిందేంటి.? ఆనాటి ఆ వెన్నుపోటుపై బాధితుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఇవన్నీ చరిత్ర మర్చిపోతుందనుకుంటే ఎలా.? కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్బంగా చంద్రబాబు, వైసీపీ మీద విమర్శలు చేసే క్రమంలో షర్మిల పేరుని లాగడంతో, స్వర్గీయ ఎన్టీఆర్ సహా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరుల పేర్లను వైసీపీ శ్రేణులు లాగుతున్నాయి.

చంద్రబాబు ఆ ముగ్గురి విషయంలో ఎలాంటి రాజకీయాలు చేశారన్నది ఆధారాలతో సహా బయటపెడుతున్నారు వైసీపీ మద్దతుదారులు. షర్మిల విషయంలో తాను చేసే కామెంట్స్ వైసీపీని ఇరకాటంలో పడేస్తాయని చంద్రబాబు అనుకున్నారుగానీ.. అవి చంద్రబాబు స్థాయిని తగ్గించేశాయన్నది నిర్వివాదాంశం. వైసీపీ పాలనపై చంద్రబాబు విమర్శలు చేయొచ్చుగాక.. అది వేరే చర్చ. అన్నట్టు, వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కర్నూలులో చేశారు. 2019 ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.