మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇటీవల అధికారిక పర్యటన నిర్వహించారు ఏపీలో. కిషన్ రెడ్డి రాజకీయ పర్యటన చేశారు. ఆ పర్యటనకీ, ఈ పర్యటనకీ చాలా తేడాలున్నాయి. కిషన్ రెడ్డి తనకు కృష్ణా జిల్లాతో అనుబంధం వుందంటూ తాజాగా చెప్పుకొచ్చారు. నిర్మలా సీతారామన్ గురించి అందరికీ తెలిసిందే.. ఆమె తెలుగింటి కోడలు కూడా. చంద్రబాబు హయాంలో సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సతీమణి ఈమె. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలోనే నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సందర్భాల్లో పర్యటించడం గమనార్హం.
ఆ సెగ కొంతమేర నిర్మలా సీతారామన్‌కి తగిలింది కూడా. కిషన్ రెడ్డికీ ఆ సెగ డైరెక్టుగా కాకపోయినా.. తగులుతూనే వుంది. 2024 ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్నది బీజేపీ అగ్రనాయకత్వం యోచన. తెలంగాణలో పరిస్థితులు బీజేపీకి సానుకూలంగానే కనిపిస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా చేయాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మెరుపు పర్యటనలో భాగంగా శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళిన విషయం విదితమే. అయితే, ఇవేవీ బీజేపీకి కాస్తయినా అడ్వాంటేజ్ కాలేకపోయాయి. సరైన నాయకత్వం ఏపీలో బీజేపీకి లేదు. అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. అన్నిటికీ మించి, రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయడంలేదన్న అభిప్రాయం జనంలో బలంగా నాటుకుపోయింది.