కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం కీలక నిర్ణయం … ఏంటంటే ?

PM Modi 70th Birthday

కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపేసేందుకు సిద్ధమని కేంద్రం తమకు తెలిపిందని రైతు సంఘాల నేతలు తెలిపారు. అయితే చట్టాల నిలిపివేతకు తాము ఒప్పుకోమని.. వీటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం కీలక నిర్ణయం ?

కేంద్రం మంత్రులతో సమావేశం అనంతరం రైతు సంఘాల నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నేడు జరిగిన పదో విడత చర్చల్లోనూ ప్రతిష్టాంభన కొనసాగడంతో.. జనవరి 22(ఎల్లుండి) మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరిపింది. ఇంతకు ముందు ఈ నెల 15న జరిగిన చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ప్రజాప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంచి చర్యలు తీసుకున్నప్పుడల్లా అడ్డంకులు వస్తాయని, రైతుల నాయకులు తమదైన రీతిలో పరిష్కారం కోరుకుంటున్నందున సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది.

ఇదిలా ఉండగా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తన మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. వ్యవసాయ చట్టాలకు సభ్యులు అనుకూలంగా ఉన్నారని, సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ను రైతులు తిరస్కరించారు. చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు.