తెలంగాణ ముద్దుబిడ్డ.. కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీర చక్ర’

గల్వాన్‌ లోయలో చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కర్నల్‌ సంతోష్‌బాబుకు అత్యున్నత సైనిక పురస్కారాల్లో రెండవదైన మహావీర చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రిపబ్లిక్‌ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ పురస్కారాన్ని సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రదానం చేయనున్నారు.

దేశంకోసం - నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..... | Facebook

సంతోష్‌తోపాటు నాడు గల్వాన్‌ ఘర్షణలో అమరులైన మరో నలుగురు సైనికులు నాయబ్‌ సుబేదార్‌ నాథూరామ్‌ సోరేన్‌, హవిల్దార్‌ కే పళని, నాయక్‌ దీపక్‌ సింగ్‌, సిపాయి గురుతేజ్‌సింగ్‌లతో పాటు హవల్దార్‌ తాజీందర్‌ సింగ్‌కు వీరచక్ర అవార్డులను ప్రకటించారు. గతేడాది జూన్‌ 15వ తేదీన జరిగిన గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు.

జమ్ముకశ్మీర్‌లో గతేడాది ఏప్రిల్‌ 4న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సుబేదార్‌ సంజీవ్‌కుమార్‌కు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. ఉగ్రవాదుల నుంచి పౌరుల ప్రాణాలను కాపాడే క్రమంలో అమరుడైన మేజర్‌ అనూజ్‌ సూద్‌తో పాటు ప్రణబ్‌ జ్యోతిదాస్‌, సోనమ్‌ షెరింగ్‌ తమాంగ్‌లకు శౌర్య చక్ర అవార్డులను ప్రకటించారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆయన కుటుంబానికి ఐదు కోట్ల నగదు, హైదరాబాద్‌లో 711 చదరపు గజాల ఇంటి స్థలంతోపాటు సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేటలోని ఓ చౌరస్తాకు సంతోష్‌బాబు చౌక్‌గా నామకరణం చేశారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.