NTR: ఎన్టీఆర్ 200వ సినిమాను బ్యాన్ చేస్తానన్న సెన్సార్.. ఎందుకంటే?

NTR: చిత్ర నిర్మాణ సంస్థల్లో నటరత్న ఎన్టీఆర్ కు చెందిన NAT కి విశిష్ట స్థానం ఉంది. సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. ఉమ్మడి కుటుంబ చిత్రాలు దాదాపు ఈ సంస్థ మీదే వచ్చాయి.

ఇకపోతే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం తర్వాత సంస్థ పేరును రామకృష్ణ NAT గా మార్చారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ 200 వ చిత్రం కోడలు దిద్దిన కాపురంను ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరు మీద నిర్మించారు. ఈ సినిమాలో కథ మొత్తం పెద్ద కోడలు చుట్టే తిరుగుతుంది. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ ఇది తన 200వ చిత్రం కాబట్టి తనకు ఇంపార్టెన్స్ ఉండాలని ఏమాత్రం పట్టు పట్టలేదు. కథ ముఖ్యం గానీ ఇంకేమీ ముఖ్యం కాదని ఆయన అన్నారట. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఎన్టీఆరే రాశారు.

ఇక ఈ సినిమా మొదటి కాపీ వచ్చాక దాన్ని సెన్సార్ కి పంపించారు. ఈ సినిమాలో సత్యనారాయణ పోషించిన దొంగ బాబా గెటప్ భగవాన్ సత్యసాయి బాబాను పోలి ఉండడం కొందరు సెన్సార్ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని వారు పట్టు పట్టారు. దాని మీద వాదోపవాదాలు కూడా జరిగాయి. ఐనా కూడా లాభం లేకపోవడంతో బొంబాయిలో సెంట్రల్ సెన్సార్ ఆఫీస్ కి వెళ్ళారు. అక్కడ క్లియరెన్స్ లభించడంతో అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేశారు ఎన్టీఆర్. వినోదాత్మక కథతో తీసిన కోడలు దిద్దిన కాపురం సినిమా సూపర్ హిట్ అయింది. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఎక్కువ రోజులు ఆడడమే కాకుండా ఉత్తమ చిత్రంగా బంగారు నందిని కూడా సొంతం చేసుకుంది.