పాచిపోయిన పాత రాజకీయం ఇంకెన్నాళ్ళు చంద్రబాబూ.!

CBN's Same Old Politics Worrying TDP

CBN's Same Old Politics Worrying TDP

ప్రతిపక్షంలో వుంటే, అధికార పార్టీని నిలదీయడం తప్పేమీ కాదు. కానీ, బెదిరింపులకు దిగడమేంటి.? ఓసారి అయితే బావుంటుందేమో.. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తాయేమో. కానీ, పదే పదే అదే ధోరణి ప్రదర్శిస్తామంటే ఎలా.? పోలీసుల్ని ఖబడ్దార్ అంటారు.. మంత్రుల్ని ఖబడ్దార్ అంటారు.. ఇదెక్కడి రాజకీయం.? సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు, తాను అధికారంలో వున్నప్పుడెలా వ్యవహరించిందీ తెలుసుకోకుండానే ఇలా మాట్లాడుతున్నారని ఎలా అనుకోగలం.? చంద్రబాబుకి అన్నీ తెలుసు.

ఒకే రాజకీయ ఫార్ములా ఆయన ఫాలో అవుతుంటారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వుంది గనుక, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వుంది గనుక.. ఆయన బెదిరిస్తే అధికారంలో వున్నోళ్ళు బెదిరిపోతారనీ.. అధికారులూ భయపడ్తారనీ.. చంద్రబాబు సహా ఆయన పార్టీకి చెందిన నేతలు భ్రమల్లో బతికేస్తుండడం కొత్త విషయమేమీ కాదు.

అధికారులపై చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి ఒత్తిడి వుండేదో, అదే స్థాయి ఒత్తిడి ప్రస్తుత ప్రభుత్వంలోనూ వుండి వుండొచ్చుగాక. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తే.. గత పాలనకు భిన్నంగా ప్రస్తుత పాలన వుంటుందనిగానీ, భవిష్యత్తులో గొప్ప గొప్ప మార్పులు వస్తాయనిగానీ ఆశించలేం.

అది చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్లకు తెలియని వ్యవహారమేమీ కాదు. అధికారుల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం అనే ప్రక్రియ చంద్రబాబు తన హయాంలో చేపట్టి వుంటే.. ఇప్పుడాయన అధికారుల్ని విమర్శించడమో.. ప్రభుత్వంలో వున్నవారిని ప్రశ్నించాల్సిన అవసరం రావడమో జరిగేదే కాదు.

ఇదే విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా తమ సన్నిహితుల వద్ద చెప్పుకోవడం షరామామూలు వ్యవహారమే అయిపోయింది. రాజకీయాల్లో చంద్రబాబు అప్‌డేట్ కాకపోవడం టీడీపీకి రాను రాను ఇబ్బందికరంగా మారుతోంది మరి.