చంద్రబాబు జూమ్ రాజకీయం: ఈసారి సౌండ్ అదిరింది.!

CBN Zoom Politics, Sounding Good This Time
CBN Zoom Politics, Sounding Good This Time
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ‘జూమ్’బాబు అంటోంది అధికార వైసీపీ. కరోనా మొదటి వేవ్ నేపథ్యంలో పూర్తిగా భాగ్యనగరానికి (అదేనండీ తెలంగాణ రాజధాని హైదరాబాద్) పరిమితమైపోయిన చంద్రబాబు, జూమ్ ద్వారా పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసేవారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అదే పని చేయాల్సి వస్తోంది. కారణం కరోనా వైరస్. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రంగా వున్న నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మళ్ళీ జూమ్ మీటింగులకు పరిమితమైపోయారు. గతంలో పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు.
 
ఎందుకో ఈసారి చంద్రబాబు జూమ్ మీటింగులకు పార్టీ శ్రేణుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోందట. అధికార వైసీపీ, చంద్రబాబు మీద విమర్శలు చేయడం మామూలే. చంద్రబాబు జూమ్ మీటింగులు వెలవెలబోతున్నాయని విమర్శించడమూ మామూలే. కానీ, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు పట్ల కాస్తంత నమ్మకంతో కనిపిస్తున్నాయట ఇప్పుడు. ఇదంతా తిరుపతి ఉప ఎన్నిక వేళ టీడీపీ సాధించిన ఓట్లేనంటున్నారు టీడీపీ నేతలు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ పూర్తిగా దెబ్బ తినేసిందనీ, తిరుపతి ఉప ఎన్నిక తమకు పరోక్షంగా లాభం చేకూర్చిందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీన్ని అల్ప సంతోషం అనాలా.? ఇంకేమన్నా అనాలా.? అన్నది వేరే చర్చ. పార్టీ పూర్తిగా నాశనమైపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో, టీడీపీ తన పట్టుని నిలబెట్టుకుంది. అదీ, టీడీపీకి డిపాజిట్ కూడా రాకుండా చెయ్యాలని మొత్తంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలంతా వైసీపీ నుంచి తిరుపతిలోనే మోహరించినా, మూడు లక్షల పై చిలుకు ఓట్లు టీడీపీకి రావడం విశేషమే మరి. ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలోనూ టీడీపీ పోరాటం ఫలించి, ప్రభుత్వం దిగిరావడంతో, చంద్రబాబు మీదా.. లోకేష్ మీదా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. ఇదంతా నిజమేనా.? పార్టీ ప్రాపకం పెంచుకోవడానికి టీడీపీ చేసుకుంటున్న ప్రచారమేనా.?