మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఇంకా నిందితులను గుర్తించలేకపోయారు పోలీసులు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఈ హత్య జరగ్గా జగన్ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైనా హత్య ఎవరు చేశారో గుర్తించలేకపోవడంతో నేరుగా ప్రభుత్వం మీదే విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షం టీడీపీ అయితే ఇప్పటికీ అధికార పక్షంతో ఏ వివాదం రేగినా వివేకా హత్యనే వేలెత్తి చూపుతూ సొంత బాబాయికే న్యాయం చేయలేనివారు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ఎద్దేవా చేస్తుంటారు. ఇక వివేకా కుమార్తె సైతం సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం పనితీరు పట్ల మరిన్ని విమర్శలు మొదలయ్యాయి.
వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాగా కేసును సీబీఐకు అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగనున్నారు. మొదటి కదలికగా హత్య జరిగిన పులివెందులలో సమగ్ర విచారణ చేపట్టనున్నారు. గతంలో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం కలిసి మూడు దఫాలు విచారణ చేసి 1300 మంది అనుమానితులను విచారించారు. అయినా అసలు హంతకులను గుర్తించలేకపోయారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు గతంలో చెప్పినట్టు సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది.
కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అందజేయాలని సిట్ అధికారులకు సూచించిన హైకోర్టు వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించి తుది నివేదిక సమర్పించాలని సీబీఐకి తెలిపింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కడపకు వెళ్లిన సీబీఐ అనుమానితుల వివరాలతో పాటు ప్రాథమిక విచారణ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశాలిచ్చారు. కానీ వివేకా కుటుంబం సీబీఐ దర్యాప్తు కోరింది. ఆ తర్వాత ఎన్నికలు, జగన్ అధికారంలోకి రావడం వెంట వెంటనే జరిగాయి. కానీ జగన్ మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించలేదు. దీంతో కోర్టులో పిటిషన్లు పడటంతో హైకోర్టే సీబీఐకి కేసును అప్పగించింది.