బీజేపీ వైపు చూస్తున్న సీబీఐ మాజీ జేడీ.?

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. విశాఖ నుంచి లోక్ సభకు ఆయన పోటీ చేయగా, విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదుగానీ, జనంతో మమేకమవుతూనే వున్నారు.

వాస్తవానికి, 2019 ఎన్నికలకు ముందే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. బీజేపీ ఆయనకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం ఇవ్వనుందంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, అవేవీ నిజమవలేదు. కానీ, బీజేపీతో జేడీ లక్ష్మినారాయణకు సన్నిహిత సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయనే చర్చ అయితే తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది.

కొన్నాళ్ళ క్రితం, ఓ ఇంటర్వ్యూలో ‘జనసేనలోకి తిరిగి వెళతారా.?’ అంటే, ‘ఏమో..’ అనేశారాయన. పవన్ గనుక పిలిస్తే, జేడీ తిరిగి జనసేనలో చేరొచ్చు. కానీ, ఈసారి ఆయన్ను పిలిచేందుకు జనసేనాని సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. అదే సమయంలో, లక్ష్మినారాయణ నేరుగా పవన్ వద్దకు వెళితే, పవన్ ఆయన్ను జనసేనలోకి తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి.

ఇదిలా వుంటే, లక్ష్మినారాయణతో బీజేపీ సంప్రదింపులు మొదలయ్యాయనీ, విశాఖ నుంచే బీజేపీ తరఫున పోటీ చేయాల్సిందిగా ఆయన్ని బీజేపీ అధిష్టానం కోరుతోందనీ ఓ గాసిప్ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం లక్ష్మినారాయణ తన ముందున్న ఆప్షన్స్‌ని విశ్లేషించుకునే పనిలో పడ్డారట.

కొద్ది రోజుల్లోనే లక్ష్మినారాయణ, తన తదుపరి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.